కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఆవశ్యకం అయింది. అందులో భాగంగానే పోషకాలతో కూడిన ఆహారాన్ని చాలా మంది తీసుకుంటున్నారు. ఇక రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఉన్న పండ్లను కూడా చాలా మంది తింటున్నారు. అయితే విటమిన్ సి విషయానికి వస్తే చాలా మంది కేవలం నారింజ పండ్లలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ నిజానికి ఇంకా ఇతర పండ్లలో కూడా విటమిన్ సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జామ పండ్లు
ఈ పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మార్కెట్‌లో మనకు చాలా తక్కువ ధరకు జామ పండ్లు దొరుకుతాయి. ఒక జామ పండును తినడం ద్వారా మనకు కేవలం 37 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. అందువల్ల దీన్ని తింటే బరువు పెరుగుతామని ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇక ఇందులో 8 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్ ఉంటాయి. 100 గ్రాముల బరువు ఉండే ఒక జామ పండులో దాదాపుగా 228.3 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి మనకు లభిస్తుంది. అందువల్ల జామ పండ్లను తింటే విటమిన్ సి మనకు పుష్కలంగా లభిస్తుంది. దాంతో శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
2. స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చూసేందుకు ఎరుపు రంగులో ఉన్నా వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే మన శరీరానికి ఉపయోగపడే ఇతర పోషకాలు కూడా వీటిలో ఉంటాయి. ఒక కప్పు స్ట్రాబెర్రీలలో దాదాపుగా 100 మిల్లీగ్రాముల వరకు మనకు విటమిన్ సి లభిస్తుంది. అలాగే ఫొలేట్ కూడా లభ్యమవుతుంది. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
3. పైనాపిల్
మన శరీరానికి ఉపయోగపడే అనేక రకాల పోషకాలకు పైనాపిల్ పవర్ హౌస్‌గా నిలుస్తుందని చెప్పవచ్చు. ఒక కప్పు పైనాపిల్ పండ్లలో దాదాపుగా 79 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి ఉంటుంది. అలాగే మాంగనీస్ అనే పోషక పదార్థం కూడా వీటిలో పుష్కలంగా లభిస్తుంది. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి.
4. మామిడి
దీన్ని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. అన్ని పండ్లకు మామిడి రారాజు లాంటిది. ఎందుకంటే అన్ని పండ్లలో ఉండే పోషకాలు మామిడి పండ్లలో ఉంటాయి. అందువల్ల మామిడి పండ్లను ఈ సీజన్‌లో కచ్చితంగా తీసుకోవాలి. ఒక మీడియం సైజు మామిడి పండులో దాదాపుగా 122.3 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
5. బొప్పాయి
బొప్పాయి పండ్లు తియ్యగా ఉంటాయి కనుక ఇందులో విటమిన్ సి ఉంటుందా అని కొందరికి సందేహం కలుగుతుంది. కానీ ఈ పండ్లలోనూ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు బొప్పాయి పండ్లలో దాదాపుగా 88 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి ఉంటుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఇది సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
6. కివీ
విటమిన్ సి పుష్కలంగా ఉండే అనేక పండ్లలో కివీ పండ్లు కూడా ఒకటి. వీటిల్లో ఇతర అనేక పోషకాలు కూడా ఉంటాయి. ఒక కివీ పండును తింటే మనకు దాదాపుగా 84 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.