కరోనా మహమ్మారితో జనాలు భయాందోళనలకు గురవుతున్న వేళ సైంటిస్టులు మరో ఊరట కలిగించే విషయం చెప్పారు. కరోనా వైరస్ కణాలను వృద్ధి చెందకుండా ఆపే మెడిసిన్‌ను వారు గుర్తించారు. మన శరీరంలోకి కరోనా వైరస్ కళ్లు, నోరు లేదా ముక్కు ద్వారా ప్రవేశిస్తుందన్న విషయం విదితమే. అయితే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించాక వ్యక్తి రోగ నిరోధక శక్తిని బట్టి 3 నుంచి 5 రోజుల్లోగా కిందకు వ్యాపించి ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అక్కడే ఆ వైరస్ కణాలు పునరుత్పత్తి అవుతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్ తీవ్రతరమవుతుంది. అదే దశలో మనకు కరోనా లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆ దశకు చేరకుండా.. అంటే కరోనా వైరస్ కణాలు పునరుత్పత్తి అవకుండా చూసే మెడిసిన్‌ను సైంటిస్టులు తాజాగా గుర్తించారు.
హెపటైటిస్ సి చికిత్స కోసం వాడుతున్న బొసెప్రెవిర్, జంతువులకు పలు అనారోగ్య సమస్యలకు వాడే యాంటీ వైరల్ డ్రగ్ జిసి-376 అనే రెండు మెడిసిన్లు కరోనా వైరస్ కణాలను పునరుత్పత్తి అవకుండా చూస్తాయని తేల్చారు. ఈ మెడిసిన్లతో పిల్లులపై నిర్వహించిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయి. దీంతో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా సైంటిస్టులు ఈ మెడిసిన్లను కరోనా చికిత్సకు ఔషధాలుగా వాడవచ్చని అంటున్నారు. అయితే వాటిలో ఒకటి మనుషులకు ఇప్పటికే వాడుతున్నారు. హెపటైటిస్ చికిత్సకు వాడే బొసెప్రెవిర్ ఇప్పటికే వినియోగంలో ఉంది. అందువల్ల దీన్ని వాడేందుకు కొత్తగా ప్రయోగాలు చేయాల్సిన పనిలేదు. ఇక ఈ మెడిసిన్ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్‌ను కలిగి ఉంటుందని అంటున్నారు.
అయితే ఈ రెండు మెడిసిన్ల వినియోగానికి సంబంధించి సదరు సైంటిస్టులు ఇంకా నిర్దిష్టమైన ప్రకటన చేయలేదు. దీనిపై వారు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. త్వరలో వారు మరిన్ని వివరాలను వెల్లడిస్తే.. వీటిని కోవిడ్ చికిత్సకు వాడేందుకు అవకాశం ఉంటుంది.