కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి హైడ్రామా మధ్యలో శనివారం స్థానిక క్రైం బ్రాంచీ కార్యాలయంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో తన అడ్వకేట్ తో కలిసి గాలి మాట్లాడుతూ… అసలు తనకు ఏం జరిగిందో తెలియదు,.. ఇంత వరకు తాను ఎలాంటి నోటీసులు అందుకోలేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, విచారణకు సహకరిస్తానని తెలిపారు. తాను ఎక్కడికి పారిపోలేదు, బెంగళూరులోనే ఉన్నా… తప్పుచేసినట్లు పోలీసుల వద్ద సాక్ష్యాలేమీ లేవని, మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు.
రూ.600 కోట్లకు ప్రజలను మోసం చేసిన అంబిడెంట్ కంపెనీ ముడుపుల కేసులో గాలి జనార్థనరెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు ఫరీద్‌ను కేసు నుండి బయటపడేసేందుకు సుమారు రూ.20 కోట్ల విలువైన బంగారాన్ని కంపెనీ యజమాని నుండి ఒక జ్యుయలరీ వ్యాపారి ద్వారా తీసుకున్నట్లు ఈడి పేర్కొంది. ప్రజలకు నిజం తెలియాలనే ఉద్దేశంతోనే వీడియో సందేశం పంపుతున్నానని అన్నారు. పోలీసులు – రాజకీయ ఒత్తిడికి లొంగిపోతున్నారని విమర్శించారు. తన ఇంటి వద్ద అనవసరంగా భయానకర వాతావరణాన్ని కల్పించారాని ఆయన పేర్కొన్నారు.