ఓ సెటిల్మెంట్ చేస్తుండగా పోలీసులు గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్నను అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేటలోని ఓ రెస్టారెంట్ లో సెటిల్ మెంట్ చేస్తుండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం దాడి చేసిన పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శేషన్న నుంచి ఓ పిస్తోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అచ్చంపేటకు చెందిన శేషన్న.. కొంతకాలం పీపుల్స్ వార్ గ్రూపులో పని చేసి ఆ తర్వాత లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు.
అప్పటి నుంచి నయీం ప్రధాన అనుచరుడిగా కొనసాగుతూ బెదిరింపులు, హత్యలు, హత్యాయత్నాల వంటి అనేక కేసుల్లో నయీంతో పాటు శేషన్న కూడా నిందితుడుగా ఉన్నాడు. 2016లో షాద్నగర్లో జరిగిన ఎంకౌంటర్లో నయీం మృతి చెందగా.. అప్పటి నుంచి శేషన్న పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్నాళ్లకు సరైన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శేషన్నను పట్టుకున్నారు.