తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వైసిపి సర్కార్ ఉపాధ్యాయులపై కేసులు పెట్టి జైల్లో వేయిస్తుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసిపి కీలక నేతలు వరుసగా విమర్శలు గుప్పించారు. కెసిఆర్ తో హరీష్ రావుకు విభేదాలుంటే వాళ్లే పరిష్కరించుకోవాలని వైసిపి కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
సజ్జల వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ సత్తా ఏమిటో మరోమారు చూపించాలంటే అందుకు తాము సిద్ధంగానే ఉన్నామని అన్నారు. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో 2014 ముందు ఉద్యమంలోనే చూశారని వ్యాఖ్యానించారు. పచ్చని కుటుంబాలను విడదీయడంలో సజ్జల సిద్ధహస్తుడని ఆరోపించారు. అయితే తాజాగా గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.
తెలంగాణ మంత్రులకు ఇష్టానుసారం మాట్లాడడం అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు అహంకారానికి ప్రతిరూపమని విమర్శించారు. వైయస్ కుటుంబం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని.. ఏపీ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వంపై దురహంకార వ్యాఖ్యలు సరికాదని అన్నారు మంత్రి చెల్లుబోయిన.