కాంగ్రెస్ పార్టీ..లోక్‌సభలో ఆ పార్టీ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్‌ను నియమించింది. ఇక సభలో చీఫ్ వీప్‌గా కొడిక్కినల్ సురేష్‌ను, అలాగే వీప్‌లుగా జావేద్,మాణిక్కం ఠాగూర్ ను ఎంపిక చేసింది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. సి. వేణుగోపాల్ ఎక్స్(ట్విట్టర్) లో తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సలహాలు, సూచనలతో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలపై గళమెత్తుతాయని అన్నారు.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే మహారాష్ట్రలోని సాంగ్లీ నుంచి రెబెల్ అభ్యర్థిగా గెలిచిన విశాల్ పాటిల్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ సభ్యుల సంఖ్య 100కి చేరింది. దాదాపు దశాబ్దం అనంతరం ఆ పార్టీ ఈ హోదాను దక్కించుకోవడం విశేషం. ఆ క్రమంలో సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. ఇంకోవైపు వయనాడ్‌కు త్వరలో బై పోల్ జరగనుంది. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనుంది.