నోటిపూత చాలా సాధారణమైన సమస్య. నోటిలో పుళ్ళు ఏర్పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది పెద్దగా హాని చేయకపోయినా చికాకుని కలిగిస్తుంది. నోటిపూతకి చాలా కారణాలున్నాయి. మలబద్దకం, విటమిన్ బీ, సీ లోపం, ఐరన్ లోపం, అసిడీటీ వంటివి కారణాలుగా కనిపిస్తాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సమస్య ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. హార్మోన్లలో మార్పులు కూడా నోటిపూతకి కారణం అవుతాయి. చెంపలు, పెదవులు.. లోపలి భాగాల్లో అయ్యే నోటిపూతని తగ్గించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. ఇంట్లో ఉన్న వస్తువులతో నోటిపూతకి చెక్ పెట్టొచ్చు.
తేనె
తేనెలో ఉన్న యాంటీబాక్టీరియా ధర్మాలు నోటిపూతని తగ్గిస్తాయి. మంచి తేనెని నోటిపూతపై రాసుకున్నా ఫలితం ఉంటుంది. లేదంటే తేనెకి ఉసిరి పొడిని కలుపుకున్న బానే ఉంటుంది.
కొంచెం పసుపు కలుపుకుని నోటి పూత అయిన ప్రదేశంలో రాసుకుంటే చాలా తొందరగా నోటిపూత సమస్య నుమ్డి బయటపడవచ్చు.
అతి మధురం
ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే అతి మధురం పొడిని నోటిపూత సమస్య నుండి బయటపడడానికి వాడవచ్చు. అతి మధురం పొడిని నీళ్ళలో గానీ, తేనెలో గానీ కలుపుకుని తాగితే కడుపులో ఉండే విషపదార్థాలన్నీ బయటకి పోతాయి. మలబద్దకం కారణంగా నోటిపూత ఏర్పడితే అతిమధురం మంచి సాయం చేస్తుంది.
త్రిఫల
తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ కలిపి త్రిఫల అంటారు. ఈ పొడిని నీళ్ళలో కలుపుకుని పుక్కిలించి ఉమ్మితే కొద్ది రోజుల్లోనే నోటిపూత సమస్య నుండి బయటపడవచ్చు.
కొబ్బరి నూనె లేదా నెయ్యి
కొబ్బరి నూనె లేదా నెయ్యిని తీసుకుని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మితే చాలు. ఈ విధంగా రోజులో మూడు నాలుగు సార్లు చేస్తే నోటిపూత నుండి ఉపశమనం కలుగుతుంది.