ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) షోకు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఈ షోకు గాను ఇప్పుడు 12వ సీజన్ కొనసాగుతోంది. అయితే ఈ షోను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేబీసీ షోలో మీకు రూ.25 లక్షలు వచ్చాయని జనాలను నమ్మిస్తూ వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ క్రమంలో అలాంటి మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ పోలీసులు జనాలను హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీలో ఇటీవలి కాలంలో కేబీసీ షో పేరిట సైబర్ నేరాలు పెరిగిపోయాయి. పాకిస్థాన్‌తోపాటు పలు ఇతర దేశాలకు చెందిన నేరగాళ్లు భారత్‌లోని ప్రజలకు కేబీసీ షోలో రూ.లక్షలు గెలిచారంటూ ఫోన్లు చేస్తున్నారు. కొందరు వాట్సాప్ కాల్స్ చేస్తూ మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. ఆయా కాల్స్, మెసేజ్‌లకు జనాలు స్పందిస్తున్నారు. దీంతో వారిని ట్రాప్‌లో పడేసి మోసగాళ్లు వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బు కాజేస్తున్నారు.
కేబీసీ షో లక్కీ డ్రా ద్వారా వచ్చిన డబ్బులు కావాలంటే అందుక కొంత ఫీజు చెల్లించాలని నేరగాళ్లు అడుగుతున్నారు. అది నిజమేనని నమ్ముతున్న జనాలు అడ్డంగా బుక్కవుతున్నారు. మోసగాళ్లు అడిగినంత మొత్తం చెల్లిస్తున్నారు. తీరా విషయం తెలిసే సరికి తాము మోస పోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు.
అయితే కేబీసీ లక్కీ డ్రా పేరిట దుండగులు మోసం చేయడం ఇదేమీ కొత్త కాదని, ప్రతి సారీ కేబీసీ షో జరిగినప్పుడల్లా వారు ఇలా మోసాలు చేస్తూనే ఉన్నారని, కనుక జనాలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేబీసీ షో లక్కీడ్రాలో రూ.లక్షలు గెలుచుకున్నారంటూ ఎవరైనా కాల్స్ చేసినా, మెసేజ్‌లు పంపినా.. వాటికి స్పందించకూడదని, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి లక్కీ డ్రాలను కేబీసీ నిర్వహించదనే విషయం గుర్తుంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.