ప్రజలను మోసం చేసేందుకు కేటుగాళ్లు రక రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అవతల ఉన్నది మోసం చేసే వారు అని తెలియక అమాయక ప్రజలు వారి బారిన పడి ఎంతగానో నష్టపోతున్నారు. ఇక ప్రస్తుతం కరోనా సమయం కనుక ఉద్యోగాలు లేని వారు చాలా మంది ఏర్పడ్డారు. దీంతో అలాంటి వారే లక్ష్యంగా కొందరు దుండగులు నకిలీ మెయిల్స్, మెసేజ్‌లు పంపిస్తూ మోసం చేస్తున్నారు.
ఫలానా కంపెనీలో మీకు మంచి జాబ్ వచ్చింది అంటూ ముందుగా మీకు మెయిల్ లేదా మెసేజ్ పంపిస్తారు. అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేయమంటారు. మీరు నిజమే అని నమ్మి ఆ లింక్‌ను ఓపెన్ చేసి అందులో అడిగే వివరాలను అందిస్తారు. ఆ తరువాత దుండగులు ఆ సమాచారంతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మీ నుంచి డబ్బులు లాగుతారు. లేదంటే ఆ డేటాను వారు తమ స్వప్రయోజనాలకు, లాభం పొందేందుకు ఉపయోగించుకుంటారు. ఇక కొందరు కేటుగాళ్లు అయితే మంచి జాబ్ వచ్చిందని చెప్పి, ఆ జాబ్‌ను పొందాలంటే ముందుగా కొంత మొత్తం సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని అడుగుతారు. ఇలా అనేక రకాలుగా ప్రస్తుతం జాబ్ ఆఫర్ల పేరిట మోసాలు జరుగుతున్నాయి. కనుక ఈ మోసాల పట్ల నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* చక్కని జాబ్ అంటూ ఎవరైనా మెయిల్ పంపినా, మెసేజ్ చేసినా అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే మీరు అప్లై చేయకుండా జాబ్ ఎలా వస్తుంది ? మీరు అప్లై చేస్తేనే కదా జాబ్ వచ్చేది. అలాంటప్పుడు చక్కని జాబ్ వచ్చిందనగానే ఎలా నమ్ముతారు ? ఈ విషయాన్ని కొంత ఆలోచిస్తే చాలు, ఆ కంపెనీలో మీరు అప్లై చేశారా, లేదా, నిజంగానే జాబ్ వచ్చిందా, అన్న వివరాలు తెలుస్తాయి. దీంతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
* జాబ్ కోసం అప్లై చేస్తే మీరు జాబ్ పొందాలనుకున్న కంపెనీకి చెందిన అధికారిక సైట్‌లో లేదా నౌక్రి లాంటి జాబ్ పోర్టల్స్‌లో ఉద్యోగానికి అప్లై చేయాలి. ఆయా సైట్లకు చెందిన అధికారిక మెయిల్ ఐడీల నుంచి వచ్చే మెయిల్స్‌కు మాత్రమే స్పందించాలి. కొన్నిసార్లు దుండగులు అచ్చం ఒరిజినల్ కంపెనీలాగే మెయిల్స్ పంపిస్తారు. వాటి మెయిల్ ఐడీలను పరిశీలిస్తే అది నకిలీ మెయిల్ ఐడీనా, కంపెనీ మెయిల్ ఐడీనా అన్న విషయం తెలుస్తుంది. అవసరం అయితే కంపెనీకి చెందిన అధికారిక సైట్‌కు వెళ్లి మెయిల్ ఐడీని చెక్ చేయవచ్చు.
* మంచి జాబ్ వచ్చిందని మెయిల్ పంపితే నిజంగా ఆ కంపెనీ అసలు ప్రస్తుతం రిక్రూట్‌మెంట్ చేసుకుంటుందా, లేదా అన్న విషయాన్ని అధికారిక సైట్ లేదా జాబ్ పోర్టల్స్‌ను సందర్శించి వెరిఫై చేసుకోవాలి.
* ఇక జాబ్ వచ్చిందని, కొంత మొత్తం డిపాజిట్ చేయాలని అడిగితే అది 100 శాతం మోసమే అని గ్రహించాలి. ఎందుకంటే కంపెనీలు ఉద్యోగులకు జాబ్‌లు ఇస్తే డబ్బులను డిపాజిట్ చేయమని అడగవు. కనుక ఇలా ఎవరైనా అడిగితే అది 100 శాతం మోసమేనని గ్రహించాలి.
ఈ విధంగా జాగ్రత్తలు పాటించడం ద్వారా జాబ్ ఆఫర్ల మోసాల బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చు.