చెన్నై: లెజెండరీ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం (ఇవాళ) తెల్లవారు జామున రత్నకుమార్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రత్నకుమార్ తుది శ్వాస విడిచారు.
కొన్ని రోజుల క్రితం తనకు కరోనా సోకింది. చికిత్స పొంది ఆయన కోలుకున్నారు. అంతకుముందే ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకుంటూ ఉంటున్నారు. బుధవారం బాగానే ఉన్న ఆయన ఇవాళ హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. ఘంటసాల రత్నకుమార్ సినీ ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్టుగా పని ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ హీరోలకు ఆయన డబ్బింగ్ చెప్పేవారు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అర్జున్, కార్తీ, అరవింద్ స్వామి సినిమాలకు ఎక్కువగా డబ్బింగులు చెప్పారు. 1000 సినిమాలకుపైగా ఆయన డబ్బింగ్ చెప్పారు. 30 సినిమాలకు పైగా ఆయన మాటల రచయితగానూ రత్నకుమార్ పని చేశారు. 8 గంటల పాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి రత్నప్రభాకర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు.