ఏపీలోని పల్నాడు జిల్లాలో గల సత్తెనపల్లి ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లో ఘరానా మోసం వెలుగుచూసింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేరే ఖాతాదారుల పేరుతో రిజిస్టర్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ని రోజులైనా తాకట్టు రసీదు ఇవ్వకుండా ఆన్ లైన్ పనిచేయడం లేదంటూ కాలయాపన చేస్తుండటంతో వినియోగదారులకు అనుమానం వచ్చింది. దీనిపై ఓ కస్టమర్ గట్టిగా నిలదీయగా..రిజిస్టర్‌లో మీ పేరు మీద గోల్డ్ లేదని, వడ్డీ ఎక్కువ కట్టాలంటూ నిర్వాహకులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు కస్టమర్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకూ ఆ బ్రాంచ్‌లో దాదాపు రూ.40 లక్షల మోసం జరిగిందని బాధితులు ఆరోపించారు. ఈ గోల్డ్ స్కామ్‌లో ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ, ఉద్యోగి గోపి పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో విచారణ జరుగుతున్నట్లు సమాచారం.