గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది.. ఇప్పటి వరకు నిమ్మలంగా రెస్ట్ తీసుకుంటూ ఉన్న నాయకులంతా ఒక్కసారిగా నిద్ర లేచారు. తమకు టిక్కెట్ వస్తుందా లేదా?? ఏదైతేనేం టిక్కెట్ దక్కించుకోవాలన్నదే లక్ష్యంగా తమ పర భేదం లేకుండా ఎదుటి పార్టీ వాళ్లను తక్కువ చేసేలా ప్రచారాలు మొదలెట్టేశారు. అంతేనా సొంత పార్టీలో తమకు పోటీగా ఉన్న నాయకుల మీద బురద చల్లడానికి వెనకాడట్లేదు. ఇందుకోసం పెయిడ్ బ్యాచ్‌లను రంగంలోకి దింపేస్తున్నారు నాయకులు. ఇక పెద్దయొత్తున సోషల్ మీడియాలో ప్రచారాన్ని మొదలు పెట్టాయి పార్టీలు. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడాలేకుండా అందరూ ప్రచారం ప్రారంభించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రచారంలో భాగంగా ప్రతీ పార్టీ తమ తమ ఉద్ధేశ్యాలను, లక్ష్యాలను ఈ పెయిడ్ కార్యకర్తలకు చెబుతుంది. తమ పార్టీ మానిఫెస్టో, ప్రత్యర్థి పార్టీ బలహీతనలను ప్రజల దృష్టికి తీసుకు రావడం ఓకే.. కానీ దిశ, దశ లేని పెయిడ్ కార్యకర్తలు విద్వేశాలను రగిలించేలా పోస్టులు చేస్తుండటం ఆదోళనకరంగా కనిపిస్తుంది.ప్రత్యర్థికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను నెట్టింట్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. రాత్రి వరకు లైకులు, షేర్‌లు మాత్రమే వీరి లెక్క. నవ్వు ఒకటంటే నేను రెండంటా అన్నట్లుగా పోటా పోటీగా సాగుతుంది ఎన్నికల ప్రచారపర్వం సోషల్ మీడియాలో..సామాజిక బాధ్యత లేకుండా పెట్టే పోస్టులతో వచ్చే సమస్యలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు..?
ఇక పార్టీల వారిగా విడిపోయిన మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి కొందరు జర్నలిస్టుల ముసుగులో విద్వేశాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతూ లైకులు చూసుకొని జబ్బలు చరుచుకుంటూ ఉంటారు. వీరు కూడా ఒకరకమైన పెయిడ్ కార్యకర్తలే. వీరిని జర్నలిస్టులు అనలేం.
హైదరాబాద్ లో అన్నిరకాల మతాలవారు, ప్రాంతాల వారు స్నేహపూర్వకంగా కలిసిమెలసి ఉండటమే అభివృద్ధికి మూలకారణం. ఇక జరగబోయే హైదరాబాద్ ఎన్నికలు… ఇక్కడ అన్ని పార్టీలు తమ తమ గెలుపు కోసం ప్రచారాస్త్రాలను రెడీ చేసుకున్నాయి. అందుకుగానూ పెయిడ్ కార్తకర్తలను నియమించేశాయి కూడా. కాకపోతే వీరు పెట్టే పోస్టులపై నిఘా ఉంచడం మాత్రం చెయ్యడంలేదు. ఇప్పటికే విద్వేశాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు సోషల్ మీడియా గోడలపై కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. వీరు చేస్తున్న పని ఎంతటి హింసకు దారి తీయవచ్చో తెలియని అవివేకులు. చిల్లర పెంకుల కోసం చిల్లర పోస్టులు పెడితే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందనే విషయం మరిచి మరీ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.
అయితే పార్టీలకు హద్దులు తెలుసు, ఎక్కడ తగ్గలో తెలుసు. మతాల మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. ఆ గీత దాటి వ్యవహరిస్తే మొదటికే మోసం అనేది ఆ పార్టీలకూ తెలుసు. అందుకే ఎక్కడా తేడా రాకుండా చూసుకుంటుంటాయి. అందర్ని కలుపుకొని పోతూ ఉంటారు. అలాగే తమ పెయిడ్ కార్యకర్తలకు హద్దులు చెబితే అందరికీ మంచిది.
– RK