పెండ్లిండ్లు.. పేరంటాలు.. పండుగలూ పబ్బాలు మాత్రమే కాదు పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేసినా తమ కుటుంబానికి కలిసి వస్తుందని నమ్ముతారు మహిళలు. అలా గుర్తుకు వచ్చే పర్వదినాల్లో దంతేరాస్.. అక్షయ తృతీయ.. ఈ రెండు పర్వదినాల్లో ఏమాత్రం బంగారం కొనుగోలు చేసినా ఐశ్వర్యం వర్తిస్తుంది ఆశిస్తారు.ఈ ఏడాది అక్షయ తృతీయ ఈ నెల 22న మొదలై 23న ముగుస్తుంది. కానీ, ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైం రికార్డు నమోదు చేస్తున్నాయి. తొలిసారి గత నెల 21న పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) రూ.60 వేల మార్కును దాటేసింది. ఈ నెలలో రూ.61 వేల నుంచి రూ.62 వేల మధ్య ట్రేడ్ అయినా.. ఇప్పుడు రూ.61 వేల వద్ద నిలకడగా సాగుతున్నది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనం, ఆర్థికమాంద్యం నేపథ్యంలో ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా బంగారం కనిపించడం కూడా దాని ధర పెరగడానికి కారణం. బంగారం దిగుమతులను నిరుత్సాహ పర్చడానికి కేంద్రం భారీగా సుంకాలు విధించడం కూడా ధర పెరుగుదలకు మరో కారణం. ఆల్ టైం రికార్డు స్థాయికి బంగారం ధర పెరగడం వల్ల ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 శాతం బంగారం విక్రయాలు తగ్గుతాయని భావిస్తున్నట్లు ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ సాయామ్ మెహ్రా తెలిపారు. దేశ రాజధానిలో బంగారం తులం (24 క్యారట్లు) ధర రూ.61,280 పలికింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో గురువారం తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.60,280 వద్ద నిలిచింది. అక్షయ తృతీయ నాడు దక్షిణ భారత రాష్ట్రాల పరిధిలో 40 శాతం, పశ్చిమ రాష్ట్రాల్లో 25, తూర్పు రాష్ట్రాల్లో 20, ఉత్తరాది రాష్ట్రాల్లో 15 శాతం బంగారం విక్రయాలు నమోదవుతాయని సాయాం మెహ్రా అంచనా వేశారు. జీజేసీ మాజీ చైర్మన్ అనంత పద్మనాభన్ సైతం అధిక ధరలతో బంగారం కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చునన్నారు. ప్రపంచ స్వర్ణ మండలి రీజనల్ (ఇండియా) సీఈఓ సోమ సుందరం పీఆర్ మాట్లాడుతూ… బంగారం కొనుగోళ్లకు అక్షయ తృతీయ నాడు భారతీయుల సంబరాలకు విడదీయరాని బంధం ఉందన్నారు. దీంతో అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోళ్లు తగ్గుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి.