పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా అదృష్టం.. ఢిల్లీలో ఘటన

ఢిల్లీ: ఓ దంపతులను అదృష్టం ఒకేసారి వరించింది. 8 ఏళ్ల నిరీక్షణకు ఇన్నాళ్లకు తెరపడింది. దీంతో ఆ ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేవ్.. అంతా దేవుడి దయేనంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. 32 ఏళ్ల మహిళకు ఘాజియాబాద్‌కు చెందిన వ్యక్తితో 8 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. అయితే వారికి పిల్లలు పుట్టలేదు. ఎంతో బాధ పడ్డారు. ఎన్నో ఆస్పత్రులకు తిరిగారు. భార్య అండంలో సమస్య ఉండటంతో కుమిలిపోయారు. పిల్లల కోసం ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) వంటి పద్ధతుల్లో కూడా ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇక పిల్లలు కలగరేమోనని అనుకున్నారు.

చివరి ప్రయత్నంగా ఢిల్లీ సీడ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనే సంతాన సాఫల్య ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అండాల ఉత్పత్తికి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిని ప్రయత్నించారు. అంతే సదరు మహిళ ఒకేసారి నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టినట్లు ఆమె తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.