దేశంలోని అగ్రగామి ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన HDFC బ్యాంకు కీలక ప్రకటన చేసింది. కస్టమర్లకు ఈ ప్రకటన శుభవార్త అనే చెప్పాలి. ముఖ్యంగా రుణాలు తీసుకునే వారికి ఇది ఊరటనిచ్చే నిర్ణయమే. చాలా రోజుల తరువాత HDFC బ్యాంకుతన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లేడింగ్ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ రేట్లు రుణ ఆధారిత వడ్డీ రేట్లుగా పిలవబడుతున్నాయి. బ్యాంకు 5 బేసిస్ పాయింట్ల వరకు ఎంసీఎల్ఆర్ తగ్గించగా.. సవరించిన రేట్లు నేటి నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది.
తాజా మార్పుల అనంతరం HDFC బ్యాంకు ఎంసీఎల్ఆర్ 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటుందని వెల్లడించింది. ఎంసీఎల్ఆర్ అనేది రుణ ఆధారిత కనిష్ట వడ్డీ రేటు, అంటే బ్యాంకులు రుణాలపై వసూలు చేయగల గరిష్టంగా తక్కువ వడ్డీ రేటు.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకుల కోసం ఒకే విధానాన్ని నిర్దారించేందుకు దీనిని ప్రవేశపెట్టింది. బ్యాంకులు ఈ రేటు పై ఆధారపడి వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఎంసీఎల్ఆర్ పెరిగితే వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఎంసీఎల్ఆర్ తగ్గితే ఈఎంఐ తగ్గుతుంది. పెరిగితే ఈఎంఐ పెరుగుతుంది.