జాతీయ రహదారులపై ఇబ్బడిముబ్బడిగా ఉన్న టోల్ ప్లాజాలతో ఇబ్బంది పడుతున్నారా? టోల్ ఫీజులతో మీ జేబులు గుల్ల అవుతున్నాయా? అయితే మీకో గుడ్ న్యూస్. త్వరలో కొన్ని టోల్ ప్లాజాలు మాయమవుతున్నాయి. జాతీయ రహదారులపై ఉన్న కొన్ని టోల్ ప్లాజాలను ఎత్తివేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60 కిలోమీటర్లు అంతకంటే తక్కువ దూరంలో టోల్‌గేట్లు ఉంటే ఒకదాన్ని మూసేయనున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు నిధుల డిమాండ్‌పై సమాధానమిస్తూ లోక్‌సభలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. కేంద్ర మంత్రి ప్రకటనతో రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న కొన్ని టోల్‌ప్లాజాలను మూసివేసేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు రెండు టోల్ గేట్లు ఉండకూడదు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని టోల్ గేట్లు అలా పని చేస్తున్నాయి. కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో అలాంటి టోల్ గేట్లు మూతపడనున్నాయి. కేంద్రం కొత్త పాలసీకి అనుగుణంగా టోల్ గేట్ల మూసివేత దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ఉన్న జాతీయ రహదారులపై ప్రస్తుతం 29 టోల్ గేట్లు ఉన్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం కొన్ని తీసివేయాల్సి ఉంది. వాటిల్లో విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ సమీపంలో ఉన్న పంతంగి, కొత్తగూడెం, మన్ననూరు, షాద్ నగర్‌లోని రాయ్‌కల్, గుమ్మడిదల, గూడూరు, కడ్తాల్ టోల్‌ప్లాజాలను తొలగించాల్సి ఉంటుంది. అయితే ఈ టోల్ గేట్ల తొలగింపుపై కేంద్రం అధికారికంగా ఓ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొన్ని టోల్ గేట్లు తొలగించాలన్న నిర్ణయంపై వాహనదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.