రెండు తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువగా ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు ఇష్టా రీతిన దోచుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఎన్ని మార్లు సమావేశం అయినా చర్చలు ముందుకు సాగడం లేదు. ఈ సమయంలో ఏపీ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన చేశారు. దసరా పండగకి ఏపీ రావాలనుకునే వారికి ఆంధ్ర ,తెలంగాణ సరిహద్దుల్లో బస్సులు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఏపీ – తెలంగాణల మధ్య ఒప్పందం కుదురుతుంది అని అనుకున్న టైమ్ లో దురదృష్టవశాత్తు బ్రేక్ పడిందని తెలంగాణ ఆర్టీసీకి మూడు రోజులు సెలవు ఉందని మంగళవారం మాట్లాడుకుందామని అన్నారని అన్నారు.
తెలంగాణ ఆర్టీసీ వాళ్ళను ఏపీ సరిహద్దుల వరకు బస్సులు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు. మార్చి 21 నుండి బస్సులు ఆపడం జరిగిందన్న ఆయన జూన్ 6 నుండి చర్చలు జరుపుతున్నామని అన్నారు. టీఎస్ ఆర్టీసీ పెట్టిన నిబంధనలు అన్ని ఒప్పుకున్నామని అన్నారు. పండగ వరకు అయినా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడుపుదామని ఆడిగామని అయినా తెలంగాణ ఒప్పుకోలేదని అన్నారు. రవాణా శాఖ మంత్రి అజయ్ తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా ఆయన వరదలు ,అసెంబ్లీ సమావేశాలు ఇతర ముఖ్యమైన పనుల వల్ల బిజీ గా ఉన్నారని అన్నారు. ఈ మంగళవారం ఇష్యూ క్లోజ్ అవుతుంది అనుకుంటున్నానని ఆయన అన్నారు.