యూజర్ల డేటా భద్రత కోసం ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నామని టెక్ కంపెనీలు చెబుతున్నా.. ఏదో రకంగా సేకరిస్తూనే ఉన్నాయి. ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, గూగుల్ సహా ప్రతి కంపెనీ యూజర్ల డేటా లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇతర కంపెనీలతో పోలిస్తే యూజర్ల నుంచి గూగుల్ ఎక్కువగా డేటా సేకరిస్తున్నట్టు స్టాక్‌యాప్ అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. సుమారు 39 రకాల సేవలకు సంబంధించి యూజర్ల డేటాను గూగుల్ సేకరిస్తోందట. దీంతో మరోసారి యూజర్ల వ్యక్తిగత సమాచార గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా బెర్ట్ హుబర్ట్ అనే డెవలపర్స్ గూగుల్‌టెల్లర్ అనే కొత్త అప్లికేషన్‌ను రూపొందించాడు.
ఈ యాప్‌ను మీ పీసీ/మొబైల్ ఫోన్‌లో ఉంటే గూగుల్ డేటా సేకరిస్తున్న ప్రతిసారీ యూజర్‌కు అలర్ట్ సౌండ్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను హుబర్ట్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ యాప్ కేవలం లైనెక్స్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే విండోస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హుబర్ట్ తెలిపాడు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. గూగుల్ తమ కంపెనీ బిజినెస్ మోడల్ ఆధారంగా యూజర్ల నుంచి డేటా సేకరిస్తుందని హుబర్ట్ తెలిపాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా పోస్ట్ షేర్ చేసినప్పుడు యూజర్ లొకేషన్ వివరాలు కూడా ఇతరులకు షేర్ అవుతున్నాయనేది ఎంతో కాలంగా వినిపిస్తున్న వాదన. దీనిపై కంపెనీ సీఈవో ఆడమ్ మొస్సేరి స్వయంగా ప్రకటన చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ డేటా వివరాలు షేర్ కావని వెల్లడించారు. కేవలం ఐఓఎస్ యూజర్లు మాత్రమే తమ లొకేషన్ వివరాలు ఇతరులతో షేర్ చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు తెలిపారు. ‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ అప్‌లోడ్ చేసే ఫొటోలు/వీడియోలు ఏ ప్రదేశానికి సంబంధించినవి అనే వివరాలు మాత్రమే సదరు పోస్ట్‌లో కనిపిస్తాయి. ఒకవేళ యూజర్లు తమ పోస్ట్‌ల లొకేషన్ వివరాలు ఇతరులకు తెలియకూడదనుకుంటే డివైజ్ సెట్టింగ్స్‌లోకి లొకేషన్ ట్రాకింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవచ్చు’’ అని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.
మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్ 16 ఏళ్ల లోపు వయసు పిల్లల ఖాతాల్లో ఆటోమేటిగ్గా అప్‌డేట్ అవుతుంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలు అభ్యంతరకరమైన కంటెంట్‌ను చూడలేరు.