సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన గూగుల్ ప్లే మ్యూజిక్ యాప్‌ను వాడే యూజర్లకు షాకిచ్చింది. ఇకపై ఆ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపింది. అక్టోబర్ నుంచి గూగుల్ ప్లే మ్యూజిక్ యాప్ సేవలను నిలిపివేస్తామని ప్రకటించింది. దానికి బదులుగా యూజర్లు యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ను వాడాల్సి ఉంటుందని సూచించింది.
గూగుల్ ప్లే మ్యూజిక్‌లో ఆగస్టు నెలాఖరు నుంచి కొత్తగా మ్యూజిక్ ట్రాక్స్‌ను యూజర్లు కొనుగోలు చేయలేరు. ఇక అక్టోబర్ నుంచి ఆ యాప్ సేవలను నిలిపివేస్తారు. అయితే యూజర్లకు తాము కొనుగోలు చేసిన మ్యూజిక్ ట్రాక్స్‌ను, లైబ్రరీని, ప్లే లిస్ట్‌లను యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు డిసెంబర్ వరకు అవకాశం కల్పిస్తారు. అందుకుగాను గూగుల్ ప్లే మ్యూజిక్‌లో ప్రత్యేకంగా ఓ టూల్‌ను అందివ్వనున్నారు. ఇక ప్లే మ్యూజిక్ యాప్ నుంచి మ్యూజిక్ ట్రాక్స్, లైబ్రరీ, ప్లే లిస్ట్‌లు తదితరాలను పూర్తిగా యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక.. యూజర్లకు చెందిన గూగుల్ ప్లే మ్యూజిక్ యాప్ పనిచేయకుండా పోతుంది. దాని సేవలు యూజర్లకు ఇక ఎంతమాత్రం అందుబాటులో ఉండవు.
కనుక యూజర్లు డిసెంబర్ లోగా గూగుల్ ప్లే మ్యూజిక్‌లో ఉన్న తమ ట్రాక్స్, లైబ్రరీ, ప్లే లిస్ట్‌లను యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. అయితే ఈ మార్పుకు అనుగుణంగా తాము యూట్యూబ్ మ్యూజిక్, గూగుల్ ప్లో స్టోర్ యాప్‌లను కూడా మోడిఫై చేస్తున్నామని గూగుల్ తెలియజేసింది.