అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేటు ఉద్యోగమైనా లేబర్ గా పరిగణింపబడే వారికి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ చట్టం కింద కొన్ని బెనిఫిట్స్ అందుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఈ బెనిఫిట్స్ కి మరిన్ని కలుపుతూ ఉద్యోగులకి మరిన్ని వరాలు కురిపించింది కేంద్ర ప్రభుత్వం.
కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ కింద ఇన్స్యూర్ చేసుకున్న ఉద్యోగులకి మెటర్నిటీ బెనిఫిట్ ని 5వేల నుండి 7500కి పెంచింది. ఈ మేరకు సవరణలు చేసి చట్టం చేసింది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ నియమాల్లో ఉన్న 51 బీ ని తొలగించాలని గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది.
నిబంధనల్లో 51వ నియమం ప్రకారం మొదటి రెండేళ్ళలో ఉద్యోగి వేతనాలలో యజమాని సహకార కింద 3శాతం, అలాగే ఉద్యోగి సహకార కింద 1శాతం తీసుకునేవారు. రెండేళ్ళ తర్వాత ఉద్యోగి వేతనాలలో యజమాని సహకారం కింద 4.75శాతం, ఉద్యోగి సహకారం కింద1.75 తీసుకుంటారు. ప్రస్తుతం ఈ దీనిపై ఒక సవరణ జరిగింది.
అదలా ఉంచితే ఉద్యోగులకి వచ్చే మెటర్నిటీ బెనిఫిట్ ని పెంచింది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ రూల్స్ 1950 ప్రకారం 56ఏ నియమంలో 5వేల రూపాయలకి బదులు 7500గా మార్చడం జరుగుతుంది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది.
అలాగే ఇన్సూర్ చేసుకున్న మహిళా ఉద్యోగి లేదా ఉద్యోగి భార్య ప్రసూతి ఖర్చుల నిమిత్తం 5వేల రూపాయలు బోనస్ గా ఇవ్వనుంది. అది కూడా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ చట్టం కింద వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్న ఉద్యోగాలకి మాత్రమే వర్తిస్తుంది.