కులాంతర వివాహాలను మన దేశంలో అస్సలు ప్రోత్సహించరు. ఇప్పటికీ అనేక చోట్ల ఈ పరిస్థితి కొనసాగుతోంది. అయితే దీన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది. 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇందుకు గాను డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటెగ్రేషన్ పేరిట ఓ స్కీమ్‌ను ప్రారంభించింది. దీన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
కులాంతర వివాహాలను ప్రోత్సహించడంతోపాటు అలా వివాహం చేసుకున్న వారికి వారి పెద్దలు ఎలాగూ సహాయం చేయరు కనుక కేంద్రమే సహాయం చేసేందుకు పైన తెలిపిన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా నూతన దంపతులకు కేంద్రం రూ.2.50 లక్షలను అందిస్తుంది. దీన్ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కులాంతర వివాహాలు చేసుకున్న వారు తమ ఏరియాకు చెందిన ఎమ్మెల్యే లేదా ఎంపీ రికమండేషన్‌తో పూర్తి చేసిన దరఖాస్తును డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్‌కు పంపించాలి.
2. అయితే దరఖాస్తు ఫాంను రాష్ట్ర లేదా జిల్లా పాలకవిభాగం అధికారులకు అందజేసినా వారు ఆ ఫాంను డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్‌కు పంపిస్తారు.
3. పెళ్లి చేసుకున్న జంటలో ఒకరు తప్పనిసరిగా దళిత వర్గానికి చెందిన వారు అయి ఉండాలి. ఇంకొకరు దళిత వర్గానికి చెందకూడదు.
4. వివాహం చేసుకున్న తరువాత దాన్ని హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం రిజిస్టర్ చేయించాలి. అప్లికేషన్ పెట్టేటప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా జతచేయాలి.
5. దంపతులు ఇద్దరికీ మొదటి పెళ్లి అయితేనే ఈ పథకం కింద నగదు లభిస్తుంది. రెండో వివాహం చేసుకున్న వారు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అనర్హులు.
6. పెళ్లి అయ్యాక ఏడాదిలోగా అప్లికేషన్ పెట్టుకుంటే నగదు వస్తుంది.
7. జంటలో ఎవరికైనా అప్పటికే ఈ తరహా పథకం కింద లబ్ధి అంది ఉంటే వారికి ఈ పథకం కింద లబ్ధి ఇవ్వరు.
8. పెళ్లయిన జంటలో దళిత వర్గానికి చెందిన వారు తప్పనిసరిగా తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.
9. తమకు అది మొదటి వివాహం అని తెలియజేసే అఫిడవిట్‌ను కూడా సమర్పించాలి.
10. భర్త, భార్య తమ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలి.
11. ఇద్దరూ కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ అకౌంట్ వివరాలను అందజేస్తే నగదు నేరుగా ఆ ఖాతాలో జమ అవుతుంది.