తన స్నేహితుడి మైనర్ కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భం దాల్చేలా చేశాడో ఢిల్లీ ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి శాఖ సీనియర్ అధికారి. అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. బాధితురాలి తండ్రి అక్టోబర్ 1, 2020న మరణించిన తర్వాత ఆ అమ్మాయి నిందితుడి అయిన డబ్ల్యూసీడీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్ కుటుంబంతో కలిసి వారి ఇంట్లో ఉంది.
అప్పటి నుంచి ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఆ అధికారి భార్య గర్భనిరోదక టాబ్లెట్స్ వేసి అబార్షన్ జరిగేలా చేసింది. అయితే ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో ఆందోళనకు గురైనా ఆమె తల్లి ఆస్పత్రిలో జాయిన్ చేసింది. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆ బాలిక తనపై జరిగిన అత్యాచారం గురించి డాక్టర్లకు చెప్పింది. డాక్టర్లు పోలీసులకు చెప్పడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి సహకరించిన ఆ అధికారి భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కేజ్రీవాల్ సర్కార్ అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.