తన జీతంతో రోజూ 120 విద్యార్థులకు అన్నదానం చేస్తున్న ప్రభుత్వ టీచర్

-

ప్రభుత్వ పాఠశాలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు.. అంటేనే చాలు.. వాళ్లు సక్కగా ఎప్పుడు చదువు చెబుతారు.. వాళ్లు విద్యార్థులను ఎప్పుడు పట్టించుకుంటారు.. అని అనేస్తాం. కానీ.. ఈ టీచర్ గురించి తెలుసుకుంటే ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అభిప్రాయం మారుతుంది. ఆయనే పీకే ఇలమరన్. తమిళనాడులోని కొడుంగైయుర్ ప్రభుత్వ పాఠశాల టీచర్. ప్రతి నెలా తన జీతంలో నుంచి 5000 రూపాయలను తన స్కూల్ లోని విద్యార్థుల ఆహారం కోసం వెచ్చిస్తున్నారు. ప్రతి రోజు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు ఉచితంగా అల్పాహారాన్ని అందిస్తున్నారు.


నిజానికి కేంద్ర ప్రభుత్వం… మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే… కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం… కేవలం మధ్యాహ్న భోజనం మాత్రమే పెడతారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ఉండదు.
దశాబ్దాలుగా టీచింగ్ అనుభవం ఉన్న ఇలమరన్.. చాలా మంది పిల్లలు ఉదయం పూట ఏం తినకుండా పాఠశాలకు రావడాన్ని గమనించేవారు. ఏం తినకుండా.. పాఠశాలకు రావడంతో చాలామంది విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోవడం, తలనొప్పితో బాధపడటం, ఎండ దెబ్బ తాకడం లాంటివి జరిగేవి. దీంతో పిల్లలు సరిగ్గా విద్య మీద ఏకాగ్రతను చూపేవారు కాదు. అందుకే… పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం కూడా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఇలమరన్. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రభుత్వంతో ఉదయం పూట అల్పాహారంపై పోరాడారు. కానీ… ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో… తన స్కూల్ విద్యార్థులకు తానే అల్పాహారం అందించాలని నిర్ణయించుకున్నారు.

గత నెల జులై 1 నుంచి స్కూల్ లోని 120 మంది విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందిస్తున్నారు. దాని కోసం తన జీతంలో నుంచి నెలకు 5000 రూపాయలను వెచ్చిస్తున్నారు.

పిల్లలు అంత వీక్ గా ఉండటం చూసి నేను చాలా భయపడ్డా. ఈ పాఠశాలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులంతా చిన్నాచితకా పని చేసుకొని కాలం వెళ్లదీసేవాళ్లే. ఉదయం పూట ఏం తినకుండా పాఠశాలకు వచ్చి సరిగ్గా చదవలేకపోతున్నారు. అందుకే…నేనే నా జీతంలో నుంచి కొంత డబ్బు కేటాయించి ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విద్యార్థులందరికీ ఉచితంగా అల్పాహారాన్ని అందిస్తున్నాను.. అన్నారు ఇలమరన్.

పాఠశాలలో ఉచితంగా అల్పాహారం అందించడం ప్రారంభించాక… విద్యార్థులు కాస్త చురుకు అవుతున్నారు. టైమ్ కు స్కూల్ కు వస్తున్నారు. ఇప్పుడు చదువు మీద కూడా దృష్టి పెడుతున్నారు. టీచర్ క్లాస్ రూంలో పాఠం చెబుతున్నప్పుడు పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉంటే టీచర్ కూడా అంతే ఉత్సాహంతో క్లాస్ చెబుతాడని ఇలమరన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news