ధరణీ పోర్టల్ పై రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరణీ సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని సూచించారు. అవసరం అయితే ఈ అంశం పై అసెంబ్లీ కూడా చర్చించాలని నిర్ణయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా ధరణీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సవరణలో కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తప్పకుండా సవరణలపైనా ప్రజల అభిప్రాయాన్ని పరిగణాలోకి తీసుకోవాలని సూచించారు. వీలు అయితే అఖిల పక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. బడ్జెట్ ప్రసంగంలో ధరణీ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఆసక్తికర విషయాలను చేసిన సంగతి తెలిసిందే. ధరణీ నిజమైన భూ యజమానులకు సొంత భూమిని దూరం చేసిందని ఆరోపించారు.