హెచ్ఐవీ, ఎయిడ్స్ సోకిన పిల్లలకు అమ్మగా మారిన బామ్మ

-

హెచ్ఐవీ, ఎయిడ్స్ ఇవి సోకిన వ్యక్తిని సమాజం చీడపురుగు కంటే దారుణంగా చూస్తుంది. అంటువ్యాధి కాదు అని చెప్పినప్పటికీ అందరికి వారితో మాట్లాడటానికి భయమే.. పెద్దవారు అంటే.. అర్థంచేసుకుని బతికేస్తారు. కానీ పెద్దల నుంచి పసిపిల్లలకు కూడా ఇది సోకుతుంది. మరి వారి పరిస్థితి ఏంటి. తల్లిదండ్రులు ఉండరు. సమాజం ఎందకు వాళ్లను అసహ్యించుకుంటుందో తెలియదు.
వారి ఆలనాపాలనా చూసేవారు కూడా ఉండరు.. అలాంటి వారే ఇద్దరు అమ్మాయిలు ..మహారాష్ట్రాకు చెందిన మంగల్‌ అరుణ్‌ షాకు ఎదురయ్యారు. ఆమె అందరిలాగా వారిని వదిలేయలేదు. అక్కున చేర్చుకుంది. తనే సొంతంగా ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఇలాంటి చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తోంది. కట్ చేస్తే.. ఇప్పుడు ఆమె 100కు పైగా చిన్నారులకు తల్లైంది.
ఆమె వయసు 69 ఏళ్లు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంలో మంగల్‌షా ఎప్పుడూ ముందుండేవారు. ఈ వయసులోనూ ఆమె తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇదే అలవాటు తన కూతురు డింపుల్‌ గాడ్గేకి కూడా వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే మహిళా రోగులకు వీళ్లిద్దరూ తమవంతు సహాయం అందించేవారు. ఈ క్రమంలో అక్కడ హెచ్‌ఐవీకి గురైన సెక్స్‌ వర్కర్స్‌ పడుతున్న ఇబ్బందులను దగ్గర నుంచి గమనించారు. మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతంలో ఇలాంటి మహిళలు చాలామంది ఉన్నారని వారు తెలుసుకున్నారు. దాంతో ఇద్దరూ కలిసి సెక్స్‌ వర్కర్స్‌కి హెచ్‌ఐవీ/ఎయిడ్స్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు..ఈ క్రమంలో వారికి ఎదురైన ఓ సంఘటన వారి సేవా ప్రస్థానంలో కొత్త మార్పుకు నాంది పలికింది.
ఈ సంఘటన 2001లో జరిగింది. మంగల్‌షా పండరపుర్‌ ప్రాంతంలో సెక్స్‌వర్కర్స్‌కి సంబంధించిన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుండగా దగ్గర్లోని గ్రామంలో ఇద్దరు అమ్మాయిలను పశువుల కొట్టం దగ్గర వదిలేసినట్టుగా వారికి సమాచారం వచ్చింది. వారు హెచ్‌ఐవీ బాధితులు. వారి తల్లిదండ్రులు ఎయిడ్స్‌తో మరణించారు. ఆ అమ్మాయిలకు సహాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఒళ్లంతా గాయాలతో వారు ఎంతో దీన స్థితిలో ఉన్నారు. మంగల్‌షా వారిని వెంటనే దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే ఎయిడ్స్‌ ఉన్న పిల్లలకు చికిత్స చేయడానికి మార్గదర్శకాలు లేవనే కారణంతో వారిని ఆసుపత్రిలో కూడా చేర్చుకోలేదు. ఆ అమ్మాయిల ఆరోగ్య పరిస్థితి చూసిన డాక్టర్లు వారు ఎక్కువ రోజులు బతకరని తేల్చి చెప్పేశారట.. ఆ తర్వాత పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఇదే పరిస్థితి.. దాంతో ఇలాంటి పిల్లలకు తనే సొంతంగా సాయం చేయాలనుకున్నారు. అనుకుందే తడవుగా 2001లో అదే ప్రాంతంలో పాలావి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు.
 అలా మంగల్‌షా ఆ ఇద్దరమ్మయిలతో సేవా సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సేవా సంస్థ ద్వారా హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు వసతి కల్పిస్తూ వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. వారికి విద్య, వైద్యం అందించడమే కాకుండా తల్లిదండ్రులు లేని లోటును కూడా మంగల్‌షా తీరుస్తున్నారు. వారికి స్వీయ సంరక్షణ విద్యలను నేర్పించడం, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం వంటివి చేస్తారు. ఈ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందిన తొమ్మిది మంది విద్యార్థులు ఇప్పుడు స్వతంత్రంగా జీవించే స్థాయికి ఎదిగారు. కొంతమందికి వివాహాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఈ ట్రస్ట్‌లో 125 మందికి పైగా చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. మంగల్‌షా సేవలను గుర్తించిన వివిధ సంస్థలు ఆమెకు పలు అవార్డులను కూడా అందించాయి.
హెచ్ఐవీ, ఎయిడ్స్ సోకిన చిన్నారుల జీవితం చాలా దారుణంగా ఉంటుంది. తప్పు ఒకరిది అయితే శిక్ష మరొకరు అనుభవిస్తారు. అవసరానికి అబద్ధం దొరికినంత ఈజీగా నమ్మకానికి నిజం దొరకదు. హెచ్ఐవీ, ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అని సమాజాన్ని నమ్మించడానకి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ బాధితులతో మాట్లాడేందుకు ఎవరూ ముందడగు వేయరు. ఇలాంటి వారికోసం ముందుకొచ్చి సాయం చేసే వాళ్లు చాలా తక్కువ. ఈ వయసులోనూ మంగల్‌షా ఈ సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమే కదా..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news