అత్యంత పిన్న వయస్కురాలైన పర్యావరణ వేత్తగా పేరుగాంచిన స్వీడన్ బాలిక గ్రెటా థన్‌బర్గ్ గుర్తుంది కదా.. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోపంగా చూస్తూ.. పర్యావరణ పరిరక్షణపై స్పీచ్ ఇచ్చి వార్తల్లోకెక్కింది. హౌ డేర్ యు.. అంటూ ప్రపంచ దేశాధినేతలను పర్యావరణ వినాశనంపై నిలదీసి పేరుగాంచింది. అయితే ఇప్పుడు ఆ బాలికే కరోనాపై పోరాటానికి ఏకంగా 1 లక్ష డాలర్లను విరాళంగా అందజేసింది.
గతంలో గ్రెటా థన్‌బర్గ్‌కు ఓ డానిష్ ఫౌండేషన్ 1 లక్ష డాలర్ల ప్రైజ్ మనీని అందజేసింది. అయితే ఇప్పుడదే డబ్బును ఆమె United Nations Children’s Fund (UNICEF)కు అందజేసింది. కోవిడ్ 19పై యునిసెఫ్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా తాను ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు గ్రెటా థన్‌బర్గ్ తెలిపింది. ప్రస్తుతం ఉన్నది కరోనా వైరస్ క్రైసిస్ అని, క్లైమేట్ క్రైసిస్‌కు తాను మద్దతు ఇచ్చినట్లే.. కరోనాపై పోరాటానికి కూడా మద్దతు ఇస్తున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపింది.
ఇక UNICEF ఆ మొత్తాన్ని కరోనా వైరస్ వల్ల పోషకాహారం అందని పేద పిల్లల కోసం ఖర్చు చేయనుంది. ఆయా చిన్నారులకు పోషకాహారం అందించేందుకు ఆ మొత్తాన్ని ఖర్చు పెడతామని UNICEF తెలియజేసింది. అలాగే పేద చిన్నారులకు కావల్సిన వైద్య సేవలను అందించేందుకు కూడా ఆ మొత్తాన్ని వినియోగిస్తామని UNICEF ప్రతినిధులు తెలిపారు.