కరోనా ప్రభావం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా జీఎస్టీ వసూళ్ల ద్వారా కేంద్రానికి ఎక్కువగా ఆదాయం లభిస్తోంది. గతేడాది అక్టోబర్ నెల కన్నా ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే కేంద్రానికి జీఎస్టీ చెల్లింపుల ద్వారా ఎక్కువ ఆదాయం లభించడం విశేషం.
అక్టోబర్ 31, 2020 నాటికి కేంద్రానికి జీఎస్టీ చెల్లింపుల ద్వారా మొత్తం రూ.1,05,155 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో సీజీఎస్‌టీ రూ.19,193 కోట్లు కాగా, ఎస్‌జీఎస్‌టీ రూ.5411 కోట్లు. ఇక ఐజీఎస్‌టీ ద్వారా వచ్చిన మొత్తం రూ.52,540 కోట్లు కాగా సెస్ రూపంలో వచ్చింది రూ.8011 కోట్లు. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో మొత్తం 80 లక్షల జీఎస్‌టీఆర్-3బి రిటర్న్స్ ఫైల్ అయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక గతేడాది అక్టోబర్ నెలలో జీఎస్టీ చెల్లింపుల ద్వారా రూ.95,379 కోట్లు రాగా ఈ సారి అది 10 శాతం పెరగడం విశేషం. కరోనా ప్రభావం వల్ల అనేక రాష్ట్రాలు నష్టాల్లో ఉన్నప్పటికీ కేంద్రానికి మాత్రం దండిగానే ఆదాయం లభిస్తుందని ఈ గణాంకాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తరువాత జీఎస్టీ చెల్లింపుల ఆదాయం రూ.1 లక్ష కోట్లు దాటడం ఇదే తొలిసారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.