దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బిల్కిస్ బానో అత్యాచార కేసులో దోషుల విడుదల తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రేపిస్టుల విడుదలపై గుజరాత్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. బిల్కిస్ బానో అత్యాచార కేసులో దోషులకు సత్ప్రవర్తన కారణంగానే శిక్ష తగ్గించామని, 14 ఏళ్లకు పైగా జైల్లో గడిపినందునే వారిని విడుదల చేశామని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది.
బిల్కిస్ బానో కేసులో దోషులకు రెమిషన్ మంజూరు చేసి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గతంలో విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేసు విచారణకు సంబంధించిన పూర్తి రికార్డులతో పాటు దోషులకు జారీ చేసిన రెమిషన్ ఆర్డర్‌నూ సమర్పించాలని గుజరాత్ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని సూచించింది. ఈ క్రమంలోనే గుజరాత్ ప్రభుత్వం సోమవారం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది.
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలపై నిర్ణయం తీసుకునే ముందు 1992 నాటి రెమిషన్ పాలసీ కింద అన్ని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. కేవలం ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా దోషులను విడుదల చేయలేదని స్పష్టం చేసింది. దోషుల సత్ప్రవర్తనతో పాటు 14 ఏళ్లకు పైగా వారు జైల్లో శిక్ష అనుభవించినందునే.. వారికి శిక్ష తగ్గించి విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు ఇవాళ పరిశీలించనుంది. దీంతో పాటు దోషుల విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా తీర్పు వెలువరించే అవకాశముంది.