గుంటూరు మార్కెట్ స్థలం పై ‘పెద్దాయన’ కన్ను ?

-

గుంటూరు మార్కెట్‌ స్థలంపై అధికార పార్టీకి చెందిన ఓ పెద్దాయన కన్ను పడినట్టు పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జోరందుకుంది. దీనిపై వైసీపీలోనే పెద్ద ఎత్తన కథలు కథలుగా చెప్పుకొంటున్నారట. గుంటూరు నడిబొడ్డున, నగర పాలక సంస్థ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఈ స్థలం కోట్లు విలువ చేస్తుంది. బిల్డ్‌ ఏపీ పథకంలో భాగంగా ఈ మార్కెట్‌ స్థలాన్ని విక్రయించాలని చూసినా.. స్థానికంగా వచ్చిన వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు.

ఎమ్మెల్యేలు స్వయంగా తెరిపించిన మార్కెట్‌ను మూసివేయడంపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. వైసీపీకి చెందిన ఓ పెద్దాయన ఈ స్థలంపై మనసు పడటం వల్లే అధికారులపై ఒత్తిడి తెచ్చి తాళం వేయించారని అనుకుంటున్నారు. పార్టీకి వీరవిధేయుడిగా పేరున్న ఆ నేతను ఇటీవలే పెద్ద పదవి వరించింది. పెద్ద పదవి వచ్చిందన్న ధీమానో లేక పాలకులకు దగ్గరన్న ధైర్యమో కానీ.. ఈ స్థలాన్ని ఎలాగైనా వశం చేసుకోవాలని ఆయన చూస్తున్నారట.

వందల కోట్ల విలువైన ఈ స్థలాన్ని ప్రభుత్వం నుంచి నేరుగా కొనుగోలు చేయాలని ఆయన అనుకుంటున్నారట. ఆ మేరకు ప్రతిపాదనలు పంపారని సమాచారం. అందుకే కరోనాను బూచిగా చూపించి తిరిగి ప్రారంభమైన మార్కెట్‌ను మూయించి.. వ్యాపారులు రాకుండా విశ్వప్రయత్నం చేశారని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అయితే వ్యాపారులు మరోసారి ఆందోళనకు దిగడంతో ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news