నల్గొండ: నదీ జలాల విషయంలో తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. నది జలాలపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని గుత్తా తప్పుబట్టారు. నిజాం రాజులు కట్టిన మూసి, డిండి ప్రాజెక్టులను కూడా గెజిట్‌లో చేర్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలకు తెలంగాణపై ప్రేమ లేదని, కేవలం అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ నాయకుల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రలో తెలంగాణ నాయకుల నోళ్లు మూయించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కొత్త ప్రాజెక్టులను, రన్నింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారని చెప్పారు. ఇది చూసి ఓర్వలేక తెలంగాణలో బీజేపీ కుట్ర పన్నుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తెలిసే కేంద్ర నాయకులు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేయాలన్నా కేంద్రం దాయాదాక్షిణ్యాలపై ఆధారపడాలన్నారు. తెలంగాణ బాగుకోరే వారెవ్వరూ కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ను స్వాగతించరని అన్నారు. కేంద్రం పునరాలోచన చేసి గెజిట్‌ను వెనక్కి తీసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.