ఆంధ్రావని రాజకీయాల్లో జనసేన కన్నా టీడీపీ కన్నా ఎక్కువగా దూసుకుపోతున్నది వైసీపీనే ! అధికారం ఉంది కనుక దూసుకుపోతున్నది అని అనుకోలేం కానీ క్షేత్ర స్థాయిలో బలం పుంజుకుని రెచ్చిపోయి రంకెలేస్తున్నది కూడా వైసీపీనే ! ఓ విధంగా కొన్ని సందర్భాల్లో తప్పులుగా ఉన్నా కూడా టీడీపీని నిలువరించేందుకు కొన్ని అవకాశాలను తనకు తాను సృష్టించుకుని తనదైన హవా ఒకటి కొనసాగిస్తోంది. ఇదే పని ఒకప్పుడు టీడీపీ చేసింది కానీ బీజేపీతో గతి చెడడంతో జగన్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణించారు.
ఆ రోజు జగన్ కు బీజేపీకి మొదట టెర్మ్స్ కుదరలేదు కానీ తరువాత మాత్రం కొందరు నడిపిన సంప్రతింపులు మంచి ఫలితాలనే ఇచ్చాయి. వాటికి అనుగుణంగానే ఇవాళ్టికీ బీజేపీ అడిగినా,అడగకపోయినా వైసీపీ చాలా విషయాల్లో పార్లమెంట్ సాక్షిగా మద్దుతు ఇస్తోంది. సాగుకు సంబంధించి నల్ల చట్టాల విషయమై ముందు మద్దతు ఇచ్చింది వైసీపీనే కానీ తెలివిగా క్షేత్ర స్థాయిలో వచ్చిన నిరసనల తరువాత వామపక్షాల నిరసనలకు మద్దతు ఇచ్చి రెండు కళ్ల సిద్ధాంతం ఒకటి పాటించింది. ఇదీ ఒకందుకు మంచిదే అని నిరూపించారు గతంలో చంద్రబాబు. అదే సూత్రాన్ని ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనువర్తింపజేశారు.
ఇక రాష్ట్రానికి చెందిన ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పును ఉంచాయి టీడీపీ మరియు వైసీపీ ప్రభుత్వాలు. కానీ జగన్ మాత్రం వీటికి కూడా భయపడడం లేదు. కేంద్రం ఎలా అయితే తనకు సహకరించడం లేదో అదేవిధంగా రేపటి వేళ తన అవసరం వచ్చినప్పుడు సహాయ నిరాకరణ చేయాలని అనుకుంటున్నారు. అదే కనుక జరిగే అవకాశమే ఉంటే
కాంగ్రెస్ సూచన మేరకు రాష్ట్రపతి ఎన్నికలనే వినియోగించుకోవాలి.ఆ ఎన్నికల్లో బీజేపీ కి కావాల్సిన ఒక శాతంకు పైగా ఓటు అన్నది జగన్ చేతిలోనే ఉంది.
విభజన చట్టం అనుసరించి మనకు రావాల్సినవి మరియు కావాల్సినవి ఆఖరు నిమిషంలో కేంద్రంతో అధికారికంగా చెప్పించి తరువాత ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది జగన్ వ్యూహంగానే ఉంది. ఓ అంచనా ప్రకారం విశాఖ కేంద్రంగా ఏర్పాటు అయ్యే రైల్వే జోన్ పై ఏ విధంగా ఓ స్పష్టత వచ్చిందో అదే రీతిన మరికొన్నింటిపై దశల వారీగా క్లారిఫికేషన్ ఇవ్వనుంది కేంద్రం. ఆ విధంగా కొంత లాబీయింగ్ చేస్తే వైసీపీకి తిరుగే ఉండదు. ఆ విధంగా వచ్చే ఎన్నికల్లో తన తరఫున జగన్ చేయాల్సిన పనులు కొన్నింటిని బీజేపీనే చేయనుంది. అందుకే బాబు కన్నా జగన్ మాత్రమే ఎక్కువ మేలు ఈ రాష్ట్రానికి చేసే అవకాశాలు అన్నవి పుష్కలంగా ఉన్నాయి అని అంటున్నది !