స్పందించాల్సినంత
సాయం చేయాల్సినంత
మనలో ఏమీ లేద్సార్
మనమంతా ఒక్కటే
బాధిత హృదయాలకు అండగా ఉండడం
బాధ్యత.. ఇదొక్కటే చాలు
నేల గుణం అర్థం చేసుకునేందుకు
మనిషి గుణం చాటి చెప్పేందుకు
కేటీఆర్ సర్ మేం స్పందించాం మీరు కూడా స్పందించండి
ఆ బస్తీలలో వెలుగులు నింపండి.అక్కడి నుంచి హుక్కా సెంటర్లను తొలగించండి..అక్కడి వారి జీవితాల్లో ఏమయినా మార్పు తెండి సర్ ..అప్పుడు ఎందరో చిన్నారుల మాన ప్రాణాలకు రక్షణ ఉంటుంది.సర్ ..మీరంటే మాకెంతో గౌరవం..మా మాట వినండి అంటోంది శ్రీకాకుళం కేంద్రంగా పనిచేసే ఫ్రెండ్స్ ఫర్ సొసైటీ.
మనుషులంతా ఒక్కటే అని నేర్పని శాస్త్రం ఏమయినా ఉందా! ప్రతిరోజూ బడి పాఠాలు పునఃశ్చరణ చేయించే స్టడీ అవర్, స్టడీ సెంటర్ అంతా ఒక్క చోట కూర్చొని ఒద్దికగా చదువుకుంటే ఆ ఆనందమే వేరు.చిన్నారి చైత్ర ఘటన తరువాత కేటీఆర్ దత్తత కాలనీ అయిన సింగరేణి కాలనీ అన్నది ఆ భాగ్య నగరి దారుల్లో ఎలా ఉంది.. ఓ అమానవీయ చర్య తరువాత ఆ కాలనీ ఎలా ఉంది.. కొందరు రాజకీయ నాయకులు వచ్చి వెళ్లారు.. డబ్బులిస్తాం అని మృతి చెందిన చిన్నారి చైత్ర తండ్రి ని ఒప్పించారు. కాదన్నాడు ఆయన. ఆ తరువాత ఏమయింది..
ఓ మహిళ తన తరఫున ఓ సర్వే చేశారు.స్వచ్ఛందంగా పోయి కాలనీలో తిరుగాడారు. ఆమె పేరు వాణి. మొత్తం ఇరవై స్టడీ సెంటర్లను ఏర్పాటుచేసి ఆ బస్తీ పిల్లలకు చదువుకు ఉన్న ఆవశ్యకత ఏంటన్నది నేర్పారు. తరువాత కొందరి దాతల సాయంతో ఆ స్టడీ సెంటర్ కు వస్తున్న పిల్లలకు మెటీరియల్ అందించారు. క్రమం తప్పక పాఠాలు బోధిస్తున్న ఔత్సాహిక యువతకు కృతజ్ఞత చెల్లించారు. చిన్నారి చైత్ర లేదు సర్ .. మనం ఏం చేయాలి.. ధైర్యం చేసి అడుగులు వేస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పారామె.. ఆ చిన్నారి చైత్రను స్మరిస్తూ..మరిన్ని మంచి పనులు చేయాలి అని అంటూ నాటి ఘటన ను తల్చుకుని కన్నీటి పర్యంతం అయ్యారు వాణి.
ఈ వార్త తెలుసుకున్నాక సోషల్ మీడియాలో ఆమె పోస్టు చదివేక శ్రీకాకుళం కేంద్రంగా నడిచే ఫ్రెండ్స్ ఫర్ సొసైటీ ముందుకు వచ్చింది. తన వంతుగా కాస్త మొత్తం ఇచ్చి శ్రమజీవుల బిడ్డలకు స్టడీ మెటీరియల్ కొనుగోలు చేయమని చెప్పింది. ప్రాంతాలు వేరు సర్ కానీ మనుషులంతా ఒక్కటే.. మనందరి కన్నా గొప్పవాడు చిన్నారి చైత్ర నాన్న.. తనకు ప్రభుత్వం ఇస్తామన్న ఇరవై లక్షల రూపాయల పరిహారాన్ని వద్దని చెప్పాడు. ఆయన దగ్గర మనమంతా ఎంత ? ఫ్రెండ్స్ ఫర్ సొసైటీ చేసింది చాలా తక్కువ..అని అంటారు ఆ సంస్థ నిర్వాహకులు సాధన, మానస, రాకేశ్, గోపీ, చిరంజీవి, ఆళ్ల కిరణ్, సత్యకృష్ణ ఇంకా ఇంకొందరు.
– రత్నకిశోర్ శంభుమహంతి