తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె-పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే తాజాగా 5వ విడుత పల్లె-పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయా మున్సిపాలిటీల్లోని మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లకు చురకలంటించారు. మున్సిపల్ అధికారులపై అరిస్తే.. గొప్ప అనుకునే వారికి కేటీఆర్ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. అధికారిక సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరిపి, సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా ముందుకు వెళ్లాలని, చైర్మన్లకు, మేయర్లకు రెక్వెస్ట్ చేశారు కేటీఆర్. మన దేశంలో ఒక దురలవాటు ఉంది. కౌన్సిల్ సమావేశాలకు గతంలో నేను కూడా అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు కూడా చెప్పాను. మళ్లీ కూడా చెప్తున్నాను. మన దేశంలో ఉన్న దురలవాటు ఏంటంటే.. అధికారుల మీద అరవడం, ఎగిరెగిరి పడటం, తిట్టడం అనేది కొనసాగుతోంది.. అదే గొప్ప.. అట్ల మాట్లాడితనే పనులు అవుతాయని కొందరు భ్రమ పడుతున్నారు. సాయంత్రం సీటి కేబుల్‌లో చూపెడుతారని కొందరు పనికిమాలిన ఆలోచనలతో ఉంటారు. మనం ఆ కల్చర్‌ను ఎంకరేజ్ చేయొద్దన్నారు కేటీఆర్.
మన వాళ్లను మనమే తిట్టుకుంటే, అవమానిస్తే.. అది ఎవర్నో అవమానించినట్లు కాదు.. మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టు.. మన ప్రభుత్వాన్ని అవమానించుకున్నట్టు తప్ప ఇంకోటి కానే కాదు. దయచేసి గతంలోనే చెప్పాను.. నేనేం భయపడేది లేదు. మొహమాటం లేనే లేదు. గతంలో చెప్పాను.. మళ్లీ చెప్తున్నాను. అర్ధవంతమైన చర్చలు జరగాలంటే మొదట కెమెరాలు సమావేశాల్లో పెట్టొద్దు. కెమెరాలను చూసి రెచ్చిపోయే ఒక బ్యాచ్ ఉంటది. కెమెరా కోసం, సాయంత్రం వార్తల్లో పడేందుకు ఎగబడి ఎగబడి మాట్లాడటం, నోటికొచ్చినట్లు మాట్లాడటం చేస్తున్నారు. ఈ దిక్కుమాలిన దందా అంతా బంద్ కావాలంటే.. కెమెరాలు బంద్ చేయాలి. ప్రెస్ మీట్ పెట్టి సమాచారం ఇస్తామని ప్రెస్ వారికి చెప్పాలని సూచించారు మంత్రి కేటీఆర్.