ఎడిట్ నోట్ : హ్యాపీ ఫాద‌ర్స్ డే

-

నాన్న‌ల‌కు శుభాకాంక్ష‌లు. జీవితాన్ని మంచి దారిలో పెట్టిన, పెట్టాల‌నుకుని ప‌రితపించిన నాన్న‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పి ఆ స్వేద జ‌ల వేదాల‌కు వంద‌నాలు చెల్లించాలి. ఇవాళ నాన్న కొంద‌రి స్మ‌ర‌ణ.. కొంద‌రి బాధ్య‌త. నాన్నను ఇప్ప‌టిదాకా నెత్తిన పెట్టుకుని పూజించే బిడ్డ‌ల‌కు ఇవాళే కాదు ప్ర‌తిరోజూ పండుగే ! బిడ్డ‌ల‌కు ఈ పాటి ఆత్మ స్థైర్యం నేర్పిన నాన్నలు అక్క‌డ‌క్క‌డా ఉన్నారు.  బిడ్డ‌ల‌కు  బాధ్య‌త‌లు నేర్ప‌ని నాన్న‌లూ ఉన్నారు. బాధ్య‌త అంటే ఉన్న చోటులో నిల‌దొక్కుకోవ‌డమే కాదు ఉన్న చోటులో ఉన్న‌వారి వృద్ధి కి కృషి చేయ‌డం.. నాన్న‌కు ఇవ‌న్నీ తెలుసు. త‌నకు తెలిసిన‌వే త‌రువాత త‌రానికి తెలియాల‌న్న త‌ప‌నతో బిడ్డ‌ల‌కు కొన్ని విష‌యాలు చెప్పి పంపుతాడు.

నాన్న మెగాస్టార్.. నాన్న సూప‌ర్  స్టార్.. రోజంతా క‌ష్ట‌ప‌డి ఇంటికి వ‌చ్చిన నాన్న ఇన్ని రూపాల్లో మ‌న‌కు క‌నిపిస్తాడు. నాన్న మ‌న‌కు రంగుల క‌ల. క‌ల‌లను నిజం చేసే రూపం కూడా ! నాన్న విజేత‌ల‌ను సృష్టిస్తాడు. అమ్మ ఆ విజేత‌ల పాదాలకు న‌డ‌వ‌డి నేర్పి పంపుతుంది. శ‌క్తి నాన్న..  శ‌క్తి కి తోడు అమ్మ.. రెట్టించిన శ‌క్తిని త‌ల్లీ తండ్రీ ఇచ్చి ఈ లోకంలో కొన్ని మంచి ప‌నులు చేయాల‌ని ఆదేశిస్తున్నారు.

రిక్షావాలా నాన్న…ఇంటికి ఎంత వేళ కు చేరుకున్నాడో . ఇవాళ ఆ నాన్న‌కు ఓ ఐఏఎస్ ఆఫిస‌ర్ కొడుకుగా ఉండ‌వ‌చ్చు. లేదా మ‌రో ఉన్న‌తాధికారి మ‌రో ఉన్న‌త స్థానంలో  ఉంటూ దేశాన్ని న‌డిపించ‌వచ్చు. కానీ ఆ తండ్రి కష్టం ద‌గ్గ‌ర పిల్ల‌లంతా చిన్న‌వారు. ఎదిగే ఆయుధాలు బిడ్డ‌లు.. కానీ యుద్ధం మంచి స్థాప‌నకే చేయాలి. ఆ ధ్యేయం లేకుండా ఉంటే యుద్ధం చేయ‌డ‌మే అనవ‌స‌రం.

నాన్న రైతు.. పుట్టెడు దుఃఖం అదిమి పెట్టుకుని పంట సాగుకు కృషి చేసిన రుషి. అటువంటి నాన్న మ‌న జీవితాన్ని ఏమ‌యినా మార్చాడా ? ప్ర‌భావితం కావ‌డంతోనే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. రైతు ఇంట బిడ్డలు దేశాన్ని న‌డుపుతున్నారు. ఓ మామూలు పారిశుద్ధ్య కార్మికుడి బిడ్డ ఈ దేశాన్ని శాసించే శ‌క్తిమంతం అయిన స్థితికి చేరుకుంటున్నాడు. అంటే ఈ బిడ్డ‌ల‌ను త‌యారుచేసిన నాన్న‌లే గొప్ప‌వారు. నాన్న‌కు తోడుగా నిలిచిన అమ్మ  గొప్ప‌వారు. ఈ రోజు ఫాద‌ర్స్  డే.. నాన్న కోసం ఏమ‌యినా చేయ‌డం చిన్న మాట.. నాన్నంత‌టి నాన్న కావ‌డంలో జీవిత ప‌ర‌మార్థం దాగి ఉంది. అదొక్క‌టీ తెలిస్తే చాలు. మీరు గొప్ప‌వారు కావొచ్చు. లేదా మీ సామాన్య స్థితి లేదా స‌హ‌జ స్థితి మీకు అర్థం అయి ఉంటే చాలు.

Read more RELATED
Recommended to you

Latest news