జీతాలు సరిగ్గా చెల్లించకుండా చిరు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం దుర్మార్గం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. పెసా మొబిలైజర్స్ ఉద్యోగుల సమస్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన ప్రభుత్వం పై విమర్శలు చేశారు. దీనిపై ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో పని చేసే పెసా మొబిలైజర్స్ 13 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని తెలిపారు.
నెలకు రూ.4000 చొప్పున ఒక్కొక్కరికీ రూ.52,000 ఈ ప్రభుత్వం బకాయి పడిందని తెలిపారు. అదేవిధంగా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని ప్రచారం చేసుకోవడమే తప్ప.. ఆచరణ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. చిరు ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించకుండా వారిని ఇబ్బంది పెట్టడం దుర్మార్గం అని మండిపడ్డారు. అంతేకాదు.. పెసా మొబిలైజర్స్ కి పెండింగ్ లో ఉన్న 13 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని నెల నెల జీతాలు చెల్లించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.