సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ యార్డులో గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్, పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హాజరయ్యారు మంత్రి హరీష్ రావు. మంత్రి సమక్షంలో ఆత్మకమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
రైతు శ్రేయోభిలాషి, రైతుల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రైతులకు ఏలాంటి ఇబ్బంది కలగొద్దని ఈ నెల 28వ తేదీ నుంచి సంక్రాంతి పండుగలోపు ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో రైతుబంధు అందించాలని నిర్ణయించారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు స్పష్టం చేశారు.బాయికాడ మీటర్లు పెడ్తలేమని 12 వేల కోట్లు కేంద్రం ఆపింది.
బీజేపీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 40 వేల కోట్లు కేంద్రం రాష్ట్రానికి వచ్చే డబ్బును ఆపేసి రాష్ట్ర ప్రజలను తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నదని మంత్రి విమర్శించారు. గతంలో యాసంగి పంట అంటే గాలిలో దీపం ఇప్పుడు సంవత్సరానికి రైతులు రెండు పంటలు తీస్తున్నారని ఇది సంబురపడే పరిస్థితి అని మంత్రి చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే ఏళ్ల తరబడి ఏనాడు మత్తడి దూకని ఈ కూడేల్లి వాగు ఇవాళ మత్తడి దూకుతున్నదని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని మంత్రి వెల్లడించారు.