తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై రెండో రోజు చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చర్చను ప్రారంభించారు. ఒకే ఏడాది 8 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఅర్ ప్రభుత్వానిదే అని హరీశ్ రావు అన్నారు.
‘ప్రతి జిల్లాలో నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. పారామెడికల్ కళాశాలల్లో అనేక కోర్సులు ప్రవేశపెడుతున్నాం. ప్రతి జిల్లాకు వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ వచ్చాక వైద్య కళాశాలల్లో సీట్లు మూడింతలు పెరిగాయి. ఒకే ఏడాది 8 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత మ ప్రభుత్వానిదే. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తిలో వైద్య కళాశాలలు వస్తున్నాయి. ప్రతిపక్ష సభ్యులున్న సంగారెడ్డి, ములుగులోనూ వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150 వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తోంది. కేంద్రం ఒక్క వైద్య కళాశాల కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు.’ – హరీశ్ రావు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి
వైద్య కళాశాలలపై ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 3,800 ఉన్నాయనీ తెలిపారు రాష్ట్రంలో 1,040 పీజీ సీట్లు ఉన్నాయనీ వెల్లడించారు.