వయస్సు పెరిగే కొద్దీ మహిళలు గర్భం దాల్చే అవకాశాలు ఎలాగైతే తక్కువగా ఉంటాయో.. అలాగే వయస్సు మీద పడ్డాక పురుషులు సంతానాన్ని పొందితే అప్పుడు ఆ సంతానానికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుందట.
ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ యుగం. పోటీ ప్రపంచంలో యువత మధ్య పోటీ చాలా ఎక్కువైంది. దీంతో ముందు కెరీర్ ప్లాన్ చేసుకుని లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యాకే వివాహం చేసుకుంటున్నారు. అప్పటికి వారికి వయస్సు కూడా ఎక్కువైపోతోంది. ప్రస్తుతం చాలా మంది 35 ఏళ్లు వచ్చాకే వివాహం చేసుకుంటున్నారు. ఇక పిల్లలను కూడా ఆలస్యంగా కంటున్నారు. అయితే లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మంచిదే.. కానీ.. వివాహం చేసుకున్నాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పిల్లలను కనాలి. అది ఆడవారు అయినా సరే.. మగవారు అయినా సరే.. వివాహం అయ్యాక ఏమాత్రం ఆలస్యం చేయరాదు. చేస్తే.. పుట్టబోయే పిల్లలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయట. ఇది మేం చెప్పడం లేదు.. సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
వయస్సు పెరిగే కొద్దీ మహిళలు గర్భం దాల్చే అవకాశాలు ఎలాగైతే తక్కువగా ఉంటాయో.. అలాగే వయస్సు మీద పడ్డాక పురుషులు సంతానాన్ని పొందితే అప్పుడు ఆ సంతానానికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుందట. అందుకనే మహిళలనే కాదు, పురుషులను కూడా త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. వయస్సు మీద పడ్డాక.. అంటే.. 35 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే.. ఆ పిల్లలు బరువు తక్కువగా పుట్టడం లేదా ప్రసవం కాకముందే చనిపోవడం లేదా గుండె జబ్బులు, గ్రహణం మొర్రి, క్యాన్సర్ తదితర అనారోగ్య సమస్యల బారిన పడడం వంటి అవకాశాలు ఉంటాయట. దీంతోపాటు అలాంటి కొందరు పిల్లల్లో మానసిక సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందట.
ఇక వయస్సు మీద పడ్డాక పెళ్లి చేసుకుని గర్భం దాల్చే మహిళల్లో డయాబెటిస్ రావడం, బీపీ పెరగడం, మూత్రంలో ప్రోటీన్లు కనిపించడం, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం.. వంటి సమస్యలు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక యువత 30 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే వారు ఆరోగ్యంగా ఉంటారని సైంటిస్టులు చెబుతున్నారు..!