హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘హెచ్‌సీఏ’ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు హైదరాబాద్ కరెప్షన్ అసోసియేషన్‌గా మారింది. ఆట కంటే… అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలే ఎక్కువ. క్రికెటర్లను తయారు చేయడం కాదు కదా… ఉన్న క్రికెటర్లను కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉంది హెచ్‌సీఏ. అధ్యక్షుడు ఎవడన్నది ముఖ్యం కాదు… అడ్డగోలుగా దోచుకున్నామా లేదా.. అనేదే హెచ్‌సీఏ ఆల్ టైం కాన్సెప్ట్ గా మారింది. హెచ్ సీఏ అవినీతి పై ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.
బ్యాటింగ్‌లో ఇరగదీయాల్సిన పనిలేదు..బౌండరీలు బాదాల్సిన అవసరం లేదు..కాసులతో సిక్సర్లు కొట్టగలిగే కెపాసిటీ ఉంటేచాలు.. దొడ్డిదారిన రంజీ ప్లేయర్ అయిపోవచ్చు. ఒక్కో లీగ్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేసేశారు ప్రతిభ ఉన్నవారిని పక్కనపెట్టి..డబ్బు తీసుకుని పనికిమాలినోళ్లను క్రీజులోకి పంపుతున్న హెచ్ సీఏ అవినీతి పై ఇప్పుడు క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
పేరుకే క్రికెట్ అసోసియేషన్. ఏనాడు క్రికెట్ అభివృద్ధికి పాటుపడింది లేదు.. రూపాయి ఖర్చు చేసింది లేదు.. పైగా క్రికెట్ పేరుతో లక్షల రూపాయలు దోచుకోవడం. అది చేస్తా.. ఇది చేస్తా… అంటూ రాజకీయ నాయకులను మించిన హామీలతో అధ్యక్షులు మారుతున్నా… హెచ్‌సీఏ తీరు మాత్రం మారడం లేదు. అంతర్గత కుమ్ములాటలు… అవినీతి ఆరోపణలు.. పైగా పైసా వసూల్ కార్యక్రమాలు. ప్రస్తుతం హెచ్‌సీఏ అధ్యక్షుడిగా టీం ఇండియా మాజీ కెప్టెన్, అసలు సిసలు హైదరాబాదీ మహ్మద్ అజారుద్దీన్ ఉన్నారు. అయినా… గత పాలకులను మించిన అవినీతి జరుగుతోంది.
క్రికెటర్ కావాలని టీం ఇండియాకి ఎంపికవ్వాలని కలలుకంటూ ఆ దిశగా పగలు రాత్రీ కష్టపడుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. రంజీ ప్లేయర్ అయినా కావాలని.. బీసీసీఐ లీగ్స్, కనీసం డివిజన్ లీగ్స్ కైనా ఆడాలని శ్రమిస్తున్నారు. కానీ..వీళ్ల క్రికెట్ జీవితానికి ఎసరు పెడుతోంది హెచ్‌సీఏ. ప్రతిభ ఉన్నవారిని కాదని.. కాసులు వెదజల్లే వారిని క్రీజ్‌లోకి పంపుతోంది. క్రికెట్‌లో ఓనమాలు రానివారిని ఎంపిక చేస్తోంది.
హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్ష స్థానంలో ఎవరున్నా.. అక్కడ ఆ లాబీదే ఆదిపత్యం. వాళ్లు తీసుకున్న నిర్ణయాలకు ఎవ్వరైనా తలొగ్గాల్సిందే. లీగ్ ఏదైనా… టోర్నీ ఏదైనా… ఆ లాబీ ఇచ్చిన పేర్లనే సెలెక్టర్లు ప్రకటించాలి. వారు తీసుకున్న నిర్ణయాలే అధ్యక్షుడి నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ ఆ020 రంజీ సీజన్..ఈ ఏడాది జరిగిన ముస్తాక్ అలీ టోర్నీల్లో లీగ్ దశలోనే హైదరాబాద్ ఇంటిముఖం పట్టింది. హెచ్‌సీఏ జట్టు చివరిగా ఆడిన ఐదు రంజీ మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ నెగ్గింది. కిందటి నెలలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌లో ఓడిపోయింది. కారణం సత్తాలేని ఆటగాళ్లేనన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఎవరి చేతిలో ఎక్కువ క్లబ్‌లు, ఎవరు ఎక్కువ డబ్బులు ముట్టచెబితే వారి పిల్లలే హైదరాబాద్ తరఫున ఆడడం ఆనవాయితీగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి క్రికెట్ సంఘాలు. డివిజన్ లీగ్‌లో ఆడాలంటే 25 నుంచి 50 వేల రూపాయలు… బీసీసీఐ టోర్నమెంట్లలో బరిలోకి దిగేందుకు 10 నుంచి 20 లక్షలు తీసుకుంటున్నారన్నది ప్రధాన ఆరోపణ. హెచ్‌సీఏ కొత్తగా క్రికెటర్లను ఎలాగో తయారుచేయలేదు, చేయదు కూడా… కనీసం ఉన్న క్రికెటర్లను కూడా కాపాడుకోలేకపోతోంది. హెచ్‌సీఏ తీరుతో విసుగెత్తి.. అంబటి రాయుడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కి మూవ్ అయ్యాడు.
టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌లాంటి గొప్ప ఆటగాడు ప్రెసిడెంట్‌గా ఉన్నా.. హెచ్‌సీఏ తీరు మారకపోవడంపై క్రికెట్ లోకం అసహనం వ్యక్తం చేస్తోంది.