హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరో ఘనత సాధించింది. ఇండియా టుడే ఆధ్వర్యంలోని మార్కెటింగ్ అండ్ డెవల్‌పమెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ నిర్వహించిన ఓ సర్వేలో హెచ్‌సీయూకి రెండోస్థానం దక్కింది. దేశంలోని విశ్వవిద్యాలయాలను జనరల్ (ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్), సాంకేతిక, వైద్య, చట్టపరమైన నాలుగు విభాగాలుగా పరిశీలించారు. ఇందులో ముఖ్యంగా వర్సిటీ పాలనా పద్ధతులు, అకడమిక్, పరిశోధనలు, మౌలిక వసతులు, పర్సనాలిటీ, లీడర్షిప్ డెవల్‌పమెంట్, కెరీర్ పురోగతి, ప్లేస్మెంట్లు తదితర వాటిని వర్సిటీ పనితీరుకు సూచికలుగా తీసుకున్నారు.
ఆబ్జెక్టివ్ ర్యాంకింగ్ సమయంలో విశ్వవిద్యాలయాల అత్యంత సమగ్రమైన, సమతుల్యమైన పోలికలను అందించడానికి ఎండీఆర్ఏ 120 ప్లస్ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించింది. పది పాయింట్ల రేటింగ్ స్కేల్లో యూనివర్సిటీల ర్యాంకులను నిర్ధారించారు. ఇందులో ఢిల్లీలోని జేఎన్‌యూ మొదటిస్థానం సాధించగా, హెచ్‌సీయూ రెండో స్థానంలో నిలిచింది. కాగా, మూడేండ్లుగా యూనివర్సిటీ ర్యాంకును మెరుగుపరుచుకుంటూ ఐదోస్థానం నుంచి రెండోస్థానం కైవసం చేసుకోవడం పట్ల వర్సిటీ వీసీ అప్పారావు సంతోషం వ్యక్తంచేసినట్టు పీఈర్వో పేర్కొన్నారు.