ఆరోగ్యవంతులు కరోనా బారిన పడితే వారు త్వరగా కోలుకుంటారని, వారు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు ఇది వరకే చెప్పిన విషయం విదితమే. అదే సమయంలో ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు కోవిడ్ బారిన పడితే వారికి ప్రాణాపాయ స్థితులు తలెత్తుతాయని, అందువల్ల వారు కోవిడ్‌తో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పారు. అయితే తాజాగా మరికొందరు సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలిందేమిటంటే.. గుండె జబ్బులు ఉన్నవారు కోవిడ్ బారిన పడితే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
ఆసియా, యూరప్, అమెరికాలలో కోవిడ్ బారిన పడి హాస్పిటళ్లలో చికిత్స పొందిన 77,317 మంది రోగులకు చెందిన ఆరోగ్య వివరాలపై ప్రచురించిన 21 అధ్యయనాలను సైంటిస్టులు విశ్లేషించారు. ఇటలీలోని మాగ్నా గ్రేషియా యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఆ అధ్యయనాలను కూలంకషంగా విశ్లేషించారు. దీంతో తేలిందేమిటంటే… హాస్పిటళ్లలో చికిత్స పొందిన వారిలో 12.89 శాతం మందికి గుండె సమస్యలు ఉన్నాయని, 36.08 శాతం మందికి హైబీపీ ఉందని, 19.45 శాతం మంది డయాబెటిస్ ఉందని తెలిపారు. ఇక కోవిడ్ బారిన పడకముందే గుండె సమస్యలు కొందరికి ఉన్నాయని, కొందరికి కరోనా వచ్చాక గుండె సమస్యలు తలెత్తాయని తెలిపారు. ఈ క్రమంలో ఈ రెండు వర్గాలకు చెందిన వారు కోవిడ్ వల్ల ఎక్కువగా చనిపోయారని గుర్తించారు.
అందువల్ల గుండె సమస్యలు ఉన్నవారు, హైబీపీ, డయాబెటిస్ తదితర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు కోవిడ్ సోకకుండా మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయా సమస్యలు ఉంటే కోవిడ్ సోకితే అలాంటి వారికి డెత్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే లక్షణాలను ఆరంభంలోనే గుర్తించి సరైన టైముకు చికిత్స అందిస్తే వారు కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటారని చెప్పారు.