కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఓ వైపు బెంబేలెత్తిపోతుంటే.. మరో వైపు ఆ వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. గురువారం ఉదయం నుంచి సెన్సెక్స్ భారీగా పతనమైంది. ఉదయం తొలి నిమిషంలోనే మదుపరులు రూ.6 లక్షల కోట్లను నష్టపోగా 11 గంటల వరకు రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. స్టాక్ మార్కెట్‌లపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడడంతో సూచీలన్నీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇక సెన్సెక్స్ 2582 పాయింట్లు పతనమై 33,114 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 767 పాయింట్లు పడిపోయి 9690 వద్ద కొనసాగుతోంది. గత 17 నెలల కాలంలో ఇంత భారీగా సెన్సెక్స్ పడిపోవడం ఇదే తొలిసారి కాగా అటు అమెరికా మార్కెట్లలోనూ బెయిర్ రన్ కొనసాగుతోంది. నిన్నటి ట్రేడింగ్‌లో డోజోన్స్ ఏకంగా 1464 పాయింట్లు నష్టపోయింది. ఇక తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్‌కు ప్రయాణాలపై నిషేధం విధించారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
ఇక మరోవైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ 74.50 గా కొనసాగుతోంది. అయితే స్టాక్ మార్కెట్లు ఇంకా పతనమైతే ట్రేడింగ్‌ను కొంత సేపు నిలిపివేసే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.