పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీరాలను ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. దీంతో వర్షాలకు కాస్త గ్యాప్ వచ్చింది. అయితే పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీరాలను ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వారు అంటున్నారు. దీంతో కోస్తా ఆంధ్ర, రాయలసీమలలో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఇక అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావాల వల్ల మంగళవారం, బుధవారం కొన్ని చో్ట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు పడతాయని అంటున్నారు.