ఈ నెల 12వ తేదీన బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఆ తరువాత అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
ఏపీ, తెలంగాణలలో ప్రస్తుతం వర్షాలు కురవడం లేదు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కానీ ఇప్పుడు వరుణ దేవుడు శాంతించడంతో ప్రజలు కాసింత ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వర్షాలు బాగా పడడంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని నదులు, జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. మరోవైపు కృష్ణా, గోదావరి నదులు నిండు కుండలను తలపిస్తూ సందడి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం వర్షాలు ఎక్కడా లేకపోయినప్పటికీ మరో రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ నెల 12వ తేదీన బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఆ తరువాత అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం, సోమవారం వరకు అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇక మధ్యప్రదేశ్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం తెలంగాణపై పడలేదని, తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలతోపాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురవవచ్చని అంచనా వేస్తున్నారు.