నిత్యం ఏదొక ఇష్యూతో ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వార్తల్లో నిలిచారు. రెండోసారి ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి నాని సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీలోని కొందరు నేతలు టార్గెట్ చేసుకుని ట్వీట్లు కూడా వేశారు. అటు వైసీపీ నేత పీవీపీపై, జగన్ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే నాని ఎప్పుడు ఎలా ? షాకులు ఇస్తారో అర్ధం కాకుండా ఉంది. ఈ క్రమంలోనే నాని ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
బందరు పోర్టు విషయంలో సొంత పార్టీకి షాకిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నాని సమర్ధించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో నవయుగకి పోర్టు పనులు అప్పగించారు. ఇప్పుడు వాటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దానికి నాని ట్విట్టర్ వేదికగా జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు. అయితే గుడ్డిగా సమర్ధించకుండా ప్రభుత్వానికి ఓ సలహా కూడా ఇచ్చారు. ఈ పోర్టు నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వానికో, వాన్‌పిక్‌కో లేక ఇతర ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టకుండా ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన సూచించారు.
ఈ విషయంలో జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. కాగా, ప్రాజెక్టు పనులను సకాలంలో చేపట్టలేదన్న కారణంగానే కాంట్రాక్టు ఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సంస్థకు లీజుకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకుంది. అలాగే పోర్టుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో నిర్మించేందుకు జగన్ యోచన చేస్తున్నట్లు సమాచారం. మరి జగన్ ప్రభుత్వం టీడీపీ ఎంపీ నాని ఇచ్చిన సలహాలని ఏ మేర పాటిస్తుందో ? నానికి వైసీపీ నేతలు ఎలాంటి రిప్లే ఇస్తారో ? చూడాలి.