గత నాలుగు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ లోకి నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం నగర వ్యాప్తంగా భారీ వర్షం గంటపాటు పడడంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది.
దీంతో అప్రమత్తమైన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టం 514.75 మీటర్లు కాగా ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నీటి మట్టం 513.210 మీటర్లకు చేరుకుంది. ఈ సమాచారం అందుకున్న జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి పరిస్థితిని పరిశీలించారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని,ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిహెచ్ఎంసి మేయర్ అధికారులను ఆదేశించారు.