ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తున్నాయి. నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈనెల 18న ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఈనెల 20న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుంది. అదే జరిగితే పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలాఉంటే.. నేడు విశాఖలో పొలిటికల్ హీట్ పెరగనుంది. ఒకే రోజు వైసీపీ, టీడీపీ, జనసేన మూడు కార్యక్రమాలు చేపట్టాయి. విశాఖ గర్జనకోసం వైసీపీ సర్వం సన్నద్ధం చేసింది. లక్ష మంది 3.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయత్రలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదారావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, రజినీ, కొడాలి నాని, రాజన్న దొర, ముత్యాల నాయుడు, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పోరేటర్లు, జేఏసీ సభ్యులు, వివిధ సంఘాల నేతలు పాల్లొనున్నారు. అయితే వర్షం కురిసినా తగ్గేదేలే అంటున్నారు వైసీపీ నేతలు.