వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర ఆంధ్రా, ఒడిశా తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ అధికారి తెలిపారు.
అలాగే మత్స్యకారులు ఎవరు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించింది. తీర ప్రాంతంలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 3.5 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అలలతో సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు హెచ్చరించారు.