హోలీ ఉత్సవాలను ఏ ప్రాంతంలో ఎలా చేస్తారో మీకు తెలుసా ?

-

హోలీ అంటే చాలు అందరికీ ఇష్టమైన పండుగ అని చెప్పవచ్చు. చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఆనందోత్సవాలతో జరుపుకొనే పండుగ. అయితే ఈ పండుగను దేశంలోని ఆయా ప్రాంతాలలో ఆయా రకాలుగా చేసుకుంటారు. ఆ విశేషాలు తెలుసుకుందాం…

 

ఉత్తరప్రదేశ్ :

ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర , బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు (ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు). భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు , రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ యొక్క ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంతఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకొంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి[1]
బెంగాల్ ప్రాంతాలలో
భారత దేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో దీన్ని దోల్యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ (“వసంతోత్సవ పండుగ”) అని అంటారు..
దుల్హేతి, ధులండి, ధులెండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున, ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు.

పంజాబ్ :

పంజాబ్లో సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకొంటారు. ఇక్కడ హోలీని హోలా మోహల్లా అంటారు.ఈ పండుగను భారీ ఎత్తున జరుపుకొంటారు. వాస్తవానికి, భారత దేశ మొత్తంలో ఆనంద్పూర్ సాహిబ్ లో జరిగే హోలీ ఉత్సవం చాలా పేరు గడించింది. విదేశాల నుండి కూడా ప్రజలు పంజాబ్కు వచ్చి వారి సంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకొంటారు.

ఒరిస్సా :

ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత వేడుకలు ప్రారంభిస్తారు.

గుజరాత్ :

గుజరాత్ లో ఈ పండగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు. అందరూ పెద్ద మైదానం లాంటి ప్రదేశం వద్ద గుమికూడి సామూహికంగా కూడా మంటలు వేస్తారు. ఈ మంటల్లో ఇంట్లో ఉన్న పాత చెక్కసామానులన్నీ తీసుకొచ్చి వేస్తారు.

మహారాష్ట్ర :

మహారాష్ట్రలో హోళీక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. హోళీ వేడుకకు ఒక వారం ముందు యవకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామానులు సేకరిస్తారు. ఉదయం వేసిన మంటలు సాయంత్రం దాకా మండుతూనే ఉంటాయి. అంత పెద్ద ఎత్తున మంటలు వేస్తారు. ఈ మంటలకు ప్రత్యేకంగా చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

మణిపూర్ :

మణిపూర్ లో ఓ ఆచారం ఉంది. మగపిల్లలు ఆడపిల్లలకు డబ్బులు ఇస్తేనే ఆడపిల్లలు వారి మీద రంగులు చల్లుతారు. రాత్రి సమయంలో చిన్నాపెద్దా అందరూ కలిసి ఒక చోట చేరి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇక్కడ వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరిరోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు.

కాశ్మీర్ :

సైనికుల పహారాలో, తుపాకుల చప్పళ్ళతో ఉద్రిక్తంగా ఉండే అందాల కాశ్మీర్ లో సైనికులతో సహా అందరూ హోళీ ఉత్సవాలలో పాల్గొంటారు. ఆటపాటలతో రంగు నీటిని ఒకరిమీద మరొకరు చల్లుకుంటారు.

లఠ్ మార్ హోళీ

ఉత్తర ప్రదేశ్ లోని మథురకు దగ్గరగా ఉన్న బర్సన అనే ఊళ్ళో హోళీని వెరైటీగా జరుపుకొంటారు. అక్కడ హోళీ సందర్భంగా మహిళలు మగవారిని లాఠీలతో పిచ్చ కొట్టుడు కొడతారన్న మాట. దీన్నే వారు లఠ్ మార్ హోలీ అని ముద్దుగా పిలుచుకుంటారు. లఠ్ అంటే లాటీ అని అర్థమట. దీనికి ఓ ప్రత్యేక కారణముంది. పురాణ కాలములో చిలిపి క్రిష్ణుడు, తనకెంతో ఇష్టమైన రాధ గ్రామానికి వచ్చి, అక్కడ ఆమెను, ఆమె స్నేహితురాళ్ళను ఆటపట్టించాడట. దీనిని తప్పుగా భావించిన ఆ గ్రామం మహిళలు, కర్రలతో క్రిష్ణయ్యను వెంట తరిమారట. అప్పటినుండి, ఈ పండగ ఇలా జరుపుకోవడం జరుగుతోంది. పక్కనే ఉన్న క్రిష్ణుడి గ్రామం, నంద్గావ్ నుండి మగవారు హోళీ ఆడడానికి ఈ గ్రామం రావడం, హుషారుగా హోళీ పాటలు పాడడం, ఆడవారిని రెచ్చగొట్టడం వారిచేతిలో లాఠీ దెబ్బలు తినడం ఆనవాయితీ అన్న మాట. కాకపోతే, ఆడవారు కొట్టే దెబ్బలను వారు ఢాలు వంటి దానిని ఉపయోగించి తప్పించుకోవచ్చు. ఆడవారు కూడా వారిని ఢాలు మీదనే ఎక్కువగా కొడతారు.
ఈ హోళీకి అక్కడ ఒక నెల రోజుల ముందు నుండే ప్రిపరేషన్ జరుగుతుంది. అత్తలు తమ కోడళ్ళకు ఆ నెల రోజు మంచి పౌష్టిక ఆహారం పెడతారట, బాగా కొట్టడానికి. ఇక్కడ కొట్టడం అనేది వారిని గాయపరచడానికి కాడు, వారి పట్ల తమ ప్రేమను చెప్పడానికి మాత్రమే అని చెబుతారు గ్రామస్తులు. ఇలాంటిదే మరో హోళీ హర్యానాలో జరుగుతుంది. దాని పేరు “కరోర్ మార్” హోళీ. ఇక్కడ వదినలు (మరదళ్ళూ కూడానేమో) మరిదిని (బావను కూడా అని నా అనుకోలు) పిచ్చ కొట్టుడు కొట్టడం స్పెషాలిటీ. సంవత్సరమంతా వారు తమ మీద వేసిన జోకులకూ సెటైర్లకూ, టీజింగులకు ఆరోజు కసి తీర్చుకుంటారన్న మాట. ఇది కేవలం కుటుంబమంతా తమ విభేదాలను మర్చిపోయి, కలిసి మెలసి జీవించడనికి చేసుకునే పండగ అని, ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయమనీ చెబుతున్నారు. విశేషమేమిటంటే, లాఠ్ మార్ హోళీ లా ఇక్కడ మగవారు ఢాలు లాంటివి తెచ్చుకోరు, ఆదవారు కూడా కేవలం దెబ్బలు తగలకుండ కొట్టడం అనే కాన్సెప్టును ఫాలో అవ్వరు. ఏది దొరికితే అది అడ్డుపెట్టుకొని తప్పించుకోవాలి, లేదా తన్నులు తినాలి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news