తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హై కోర్టును విభజిస్తూ కేంద్రం ప్రభుత్వం బుధవారం సాయంత్రం గెజిట్ విడుదల చేసింది. దీంతో జనవరి 1 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు హై కోర్టులు అమల్లోకి రానున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆంధ్ర, రాయలసీమ న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో హై కోర్టు ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదని.. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలంటూ వారు కేంద్రాన్ని ప్రశ్నించారు. అంతేకాక జడ్జిలను బెంచ్ నుంచి దింపి కోర్టు నడవకుండా చేశారు. ఆంధ్రాలో ఇప్పటికీ కోర్టు సముదాయాలు ఇంకా సిద్ధం కాలేదని.. అలాంటప్పుడు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. ఆంధ్రా న్యాయవాదులు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి తమకు మద్దతు పలకాల్సిందిగా కోరారు. సరైన సమయం ఇవ్వక పోవడం వల్ల కేసుల విభజన, సిబ్బంది విభజన వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.
హై కోర్టు విభజనకు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ మాత్రం మరి కొద్ది రోజుల్లో హైకోర్టు సముదాయాన్ని పూర్తి చేస్తామని చెప్పడం… దీనిని అనుసరించి కేంద్ర విభజన చేయడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్లైయింట్లకు, న్యాయవాదులకు గందరగోళం ఏర్పాటు కానుందని వారు పేర్కొన్నారు. ఏది ఏమైన ఓవైపు విభజించమని కొందరు న్యాయవాదులు …మరో వైపు సమయం కావాలంటూ మరికొందరు పట్టు బట్టడంతో హైకోర్టు విభజన మరోసారి చర్చనీయాంశమైంది.